ఓలా డ్రైవర్ నిర్వాకం.. ఎగ్జామ్ టైంలో నడిరోడ్డుపై వదిలేశాడు! కోర్టులో చుక్కలు చూపించిన యువతి!
ప్రస్తుత రోజుల్లో సిటీల్లో ట్రావెల్ చేయాలంటే చాలామంది ఓలా, ఉబర్ లాంటి యాప్స్‌నే నమ్ముకుంటున్నారు. అయితే కొన్నిసార్లు ఈ డ్రైవర్లు చేసే పనులు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఒక షాకింగ్ ఘటనే ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. కెరీర్‌లోనే అత్యంత కీలకమైన జడ్జి ఎగ్జామ్ రాసేందుకు వెళ్తున్న ఒక యువతిని, ఓలా ఆటో డ్రైవర్ నడిరోడ్డుపై వదిలేశాడు. సోషల్ మీడియాలో ఈ విషయం ఇప్పుడు తెగ ట్రెండింగ్ (Trending) అవుతోంది. కానీ, ఆ యువతి ఊరికే వదల్లేదు.. సదరు కంపెనీని కోర్టుకు లాగి మరీ బుద్ధి చెప్పింది.

అసలు ఏం జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక యువతి తన తల్లితో కలిసి 'ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జ్ మెయిన్స్ ఎగ్జామ్' రాయడానికి బయల్దేరింది. గుంటూరు నుండి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉన్న ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లడానికి ఓలా యాప్‌లో ఒక ఆటో బుక్ చేసుకుంది. ఆటో రాగానే.. యాప్‌లో చూపించిన నెంబర్ కాకుండా వేరే వెహికల్ వచ్చింది. డ్రైవర్ మొండిగా ప్రయాణం మొదలుపెట్టకముందే ఓటీపీ (OTP) చెప్పాలని పట్టుబట్టాడు. సరే టైం అయిపోతుందని ఆమె ఓటీపీ చెప్పేసింది.
ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. ఆ డ్రైవర్ ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లకుండా దారి మళ్లించాడు. రూట్ మార్చడమే కాకుండా.. పరీక్షా కేంద్రానికి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలోకి తీసుకెళ్లిపోయాడు. అక్కడ ఆపి, ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లాలంటే అదనంగా ఎక్కువ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకు ఆ యువతి నిరాకరించడంతో, ఏమాత్రం మానవత్వం లేకుండా ఆ యువతిని, ఆమె తల్లిని నడిరోడ్డుపైనే దించేసి వెళ్లిపోయాడు.
తీవ్ర మనోవేదనతో ఎగ్జామ్..
ఆ కంగారులో, ఆఖరి నిమిషంలో ఆమె సొంత ఖర్చులతో మరో ఆటో మాట్లాడుకుని ఎలాగోలా ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకుంది. కానీ, అంత పెద్ద ఎగ్జామ్ రాసే ముందు జరిగిన ఈ గొడవ వల్ల ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురైంది. ప్రశాంతంగా ఎగ్జామ్ రాయలేకపోయింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. ఊరికే వదిలేస్తే లాభం లేదని ఓలా యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపింది. రూ. 5 లక్షల నష్టపరిహారం కావాలని కర్నూలు జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించింది.
ఓలా వింత వాదన.. కోర్టు గట్టి కౌంటర్!
కోర్టులో ఓలా కంపెనీ చాలా వింతగా స్పందించింది. "మేము కేవలం డ్రైవర్లను, కస్టమర్లను కలిపే ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ (Intermediary) మాత్రమే. డ్రైవర్లు చేసే తప్పులకు మాకు ఎలాంటి సంబంధం లేదు" అంటూ చేతులెత్తేసే ప్రయత్నం చేసింది. అంతేకాదు, తాము సదరు డ్రైవర్‌ను బ్లాక్ చేశామని, రైడ్‌కు ఎలాంటి డబ్బులు తీసుకోలేదు కాబట్టి కస్టమర్‌కు నష్టమేమీ జరగలేదని వాదించింది.
కానీ వినియోగదారుల కోర్టు ఈ వాదనను పూర్తిగా తప్పుబట్టింది. "కస్టమర్లు మీ యాప్ నమ్మకం చూసే బుక్ చేసుకుంటారు. ఓటీపీ మీ సిస్టమ్ ద్వారానే జనరేట్ అవుతుంది. కాబట్టి డ్రైవర్ తప్పు చేస్తే కంపెనీదే బాధ్యత" అని స్పష్టం చేసింది. ఎగ్జామ్ రాసే అమ్మాయిని, ఆమె తల్లిని రోడ్డుపై వదిలేయడం వల్ల ఆమె తీవ్రమైన మానసిక వేదనను అనుభవించిందని కోర్టు అంగీకరించింది.
కోర్టు సంచలన తీర్పు
అంతిమంగా, సేవల్లో లోపం (Deficiency in Service) ఉన్నందుకు గానూ ఓలా కంపెనీ సదరు యువతికి రూ. 50,000 నష్టపరిహారం, అలాగే కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ. 5,000.. మొత్తంగా రూ. 55,000 చెల్లించాలని కర్నూలు కన్స్యూమర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కస్టమర్ల భద్రతను గాలికి వదిలేసే క్యాబ్ సంస్థలకు ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరిక లాంటిదని జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications