ev: తమిళనాడులో ఓలా భారీ పెట్టుబడులు.. అక్కడ ఏమి తయారుచేస్తుందంటే..
ev: సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాలను కాదని ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు భారత్ మొగ్గుచూపుతోంది. విద్యుత్ బైక్ లు, కార్లు ఇప్పటికే మార్కెట్లో ప్రజల అందిరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం 1 శాతంగా ఉన్న EV వాహనాల వినియోగాన్ని రానున్న రోజుల్లో మరింతగా పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సైతం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ తరుణంలో EVలకు సంబంధించి కార్లు, బ్యాటరీల తయారీ కోసం ఓలా సంస్థ 920 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది.

ఇకపై కార్లు, బ్యాటరీలు
ఎలక్ట్రిక్ కార్లు, బ్యాటరీల తయారీ కోసం EVల తయారీ సంస్థ ఓలా.. తమిళనాడులో 920 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రూ.7,614 కోట్లతో నాలుగు చక్రాల వాహనాలు, 20 గిగావాట్ల బ్యాటరీ తయారీ సామర్థ్యం ఏర్పాటుకు సంస్థతో MOU కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఓలా తన అనుబంధ సంస్థలు ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ మరియు ఓలా సెల్ టెక్నాలజీస్ ద్వారా ఈ పెట్టుబడులు పెట్టనుంది.

పెట్టుబడులు, ఉద్యోగాలే లక్ష్యం
రూ.50 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 1.50 లక్షల ఉద్యోగాలను సృష్టించడాన్ని తమిళనాడు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఫిబ్రవరి 14న కొత్త EV పాలసీని అధికారికంగా విడుదల చేశారు. ప్రస్తుతం ఓలాతో కుదిరిన ఒప్పందం వల్ల 3,111 మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రపంచవ్యాప్త విస్తరణ
తమిళనాడులో ఓలా ఇప్పటికే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేస్తోంది. ప్రస్తుతం లక్షకు పైగా ఉత్పత్తి చేస్తోంది. కొత్త పెట్టుబడి ద్వారా రాష్ట్రంలో కార్లు, బ్యాటరీల తయారీకి సైతం సిద్ధమవుతోంది. ఏటా లక్షా 40 వేల కార్లను ఉత్పత్తి చేసేందుకు 3 వేలకు పైగా కార్మికులను కొత్తగా నియమించుకోవాలని చూస్తోంది. గతేడాది సెప్టెంబరులో నేపాల్ లోకి ప్రవేశించిన ఓలా.. లాటిన్ అమెరికా, ఇతర ఆసియా, ఐరోపా దేశాలకూ విస్తరించాలని ప్రణాళికలు రచించినట్లు ఆ సంస్థ పేర్కొంది.

ఆ ఎగుమతుల్లో మూడింట ఒక వంతు
EV పరిశ్రమను రాష్ట్రంలో ప్రోత్సాహించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పాలసీ 2023ని ఆవిష్కరించింది. దేశంలోని ఆటోమోటివ్ ఎగుమతుల్లో దాదాపు మూడింట ఒక వంతు వాటా తమిళనాడు సొంతం. ఇప్పుడు EV తయారీని మరింత పెంచాలని చూస్తోంది. తాజా పాలసీ ప్రకారం EVలకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, పర్మిట్ ఫీజులను మాఫీ చేస్తోంది.


Click it and Unblock the Notifications