Ola News: కోట్లు ఆదా చేసేందుకు ఓలా సంచలన నిర్ణయం.. మొన్న మైక్రోసాఫ్ట్ ఇవాళ గూగుల్‌కు ఝలక్..
Google News: ఈ కాలంలో కేవలం మ్యాప్స్ ఉపయోగించి ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తున్నారు. కేవలం వ్యక్తులు మాత్రమే కాకుండా ఫుడ్ డెలివరీ, రైడ్ హెయిలింగ్ నుంచి పలు సంస్థలు గూగుల్ అందిస్తున్న మ్యాప్స్ సర్వీసును వినియోగిస్తున్నాయి. అయితే కొన్ని కంపెనీలు ప్రత్యామ్నాయాల దిశగా చూస్తున్నాయి. ఇప్పటికే ఈ దిశగా చర్యలు కూడా ప్రారంభించాయి.
ప్రముఖ రైడ్ హెయిలింగ్ కంపెనీ ఓలా క్యాబ్స్.. గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించడం నిలిపివేయాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయంగా తన సొంత ఓలా మ్యాప్స్‌కి మారింది. ఫలితంగా ఏటా దాదాపు 100 కోట్లు ఆదా చేయాలని చూస్తోంది. ఇదేకాక రాబోయే రోజుల్లో ఓలా క్యాబ్స్‌లో అనేక ఫీచర్లు ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ CEO భవిష్ అగర్వాల్ తెలిపారు. స్ట్రీట్ వ్యూ, న్యూరల్ రేడియన్స్ ఫీల్డ్‌లు (NERFలు), ఇండోర్ ఇమేజ్‌లు, 3D మ్యాప్‌లు మరియు డ్రోన్ మ్యాప్‌లు వాటిలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఓలా గ్రూప్ ఇటీవల తన కార్యకలాపాలను కృత్రిమ్ AIకు మార్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన 3 నెలల తరువాత మైక్రోసాఫ్ట్ అజూర్‌తో భాగస్వామ్యానికి కంపెనీ ముగింపు పలికింది. అజూర్ సర్వీసుల నుంచి గత నెలలో వైదొలగిన తర్వాత ఇప్పుడు మ్యూప్స్ దిశగా చర్యలు తీసుకున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెల్లడించారు.
జనవరిలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఓలా మ్యాప్స్‌ని దాని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లోకి చేర్చాలనే ఉద్దేశాలను కూడా కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం తన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం సాలిడ్-స్టేట్ బ్యాటరీలను పరిశోధించే పనిలో ఉంది. వచ్చే ఏడాది నాటికి ఈ వినూత్న బ్యాటరీలను స్కూటర్‌లలోకి చేర్చాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తమిళనాడులోని కొత్త గిగాఫ్యాక్టరీలో వాటిని ఉత్పత్తి చేయాలని భావిస్తోంది.


Click it and Unblock the Notifications