ఓలా బంపర్ ఆఫర్: ఇకపై బుకింగ్‌పై నో కమిషన్, డ్రైవర్లకి పండగే !
ఓలా క్యాబ్‌లతో పనిచేస్తున్న డ్రైవర్లకు శుభవార్త. ఇకపై వారి కష్టానికి పూర్తి ఆదాయం లభిస్తుంది. తాజాగా కంపెనీ ఎలాంటి బుకింగైన ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోకూడదని సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఓలా ప్రతి రైడ్‌పై డ్రైవర్ల నుండి భారీ కమిషన్ వసూలు చేయడంతో డ్రైవర్ల సంపాదన తగ్గేది. కానీ ఈ కొత్త విధానంతో రైడ్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయం డ్రైవర్‌కే చెందుతుంది. దీనితో ఓలాతో అనుబంధం ఉన్న 10 లక్షలకు పైగా డ్రైవర్లు రైడ్‌లు లేదా ఆదాయానికి సంబంధించిన ఎటువంటి పరిమితి లేకుండా ఛార్జీల నుండి వచ్చే పూర్తి ఆదాయం వారి జేబులోకి వెళ్తుంది.

కొత్త వ్యాపార ఆలోచన, పనితీరు: ఓలా ఈ ప్రకటనను కొత్త వ్యాపార ఆలోచన కింద చేసింది. ఈ నమూనాలో డ్రైవర్లు కంపెనీకి ఇకపై ఎటువంటి చెల్లింపులు చేయరు. కస్టమర్ నుండి ఎంత ఛార్జీ వచ్చినా అది 100% డ్రైవర్ అకౌంట్లోకే వెళ్తుంది. ఇప్పుడు ఓలా కేవలం సాంకేతిక వేదికగా మాత్రమే పనిచేస్తుంది. అంటే డ్రైవర్, రైడర్‌ను కలిపే మాధ్యమంగా మారనుంది. కస్టమర్ యాప్ లేదా క్యాష్ ద్వారా చెల్లించిన పూర్తి ఛార్జీ డ్రైవర్ పొందుతారు. ఓలా ఆదాయం ఇప్పుడు ఫ్లాట్ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే, డ్రైవర్లు ప్రతి నెలా నిర్ణీత చార్జిస్ చెల్లించడం ద్వారా కంపెనీ సేవలను ఉపయోగించుకుంటారు.
డ్రైవర్లకు భారీ విజయం: ఇప్పటివరకు ఓలా ఇంకా ఇతర రైడ్-షేరింగ్ కంపెనీలు ప్రతి రైడ్‌పై 20% నుండి 30% కమిషన్ వసూలు చేసేవి. ఇది డ్రైవర్ల ఆదాయంలో భారీ కోతకు దారితీసేది. కానీ ఈ కొత్త విధానం ఇప్పుడు వారి ఆదాయంపై ప్రత్యక్షంగా, సానుకూలంగా ప్రభావం చూపనుంది. ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ కూడా ఈ నిర్ణయం గురించి ట్వీట్ చేస్తూ డ్రైవర్ల జీవితాలను మెరుగుపరచడానికి ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.
కస్టమర్లకు మార్పులు: కస్టమర్లకు బుకింగ్ అనుభవం ప్రస్తుతమున్నట్లే ఉంటుంది. అయితే ఈ మార్పు వలన డ్రైవర్లు మరింత సంతృప్తి చెంది, మెరుగైన సేవా స్థాయిలు, మరింత సజావుగా ప్రయాణ అనుభవం లభిస్తుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం రైడ్-షేరింగ్ పరిశ్రమలో ఒక నూతన ఒరవడిని సృష్టించనుంది. ఈ కొత్త చర్య ఆటో, బైక్ ఇంకా క్యాబ్ సేవలకు వర్తిస్తుందని ఓలా తెలిపింది.
ఓలా కన్స్యూమర్ ప్రతినిధి మాట్లాడుతూ "భారతదేశం అంతటా జీరో కమిషన్ మోడల్ ప్రారంభించడం మా రైడ్-హెయిలింగ్ వ్యాపారంలో గొప్ప మార్పు. కమిషన్ తొలగించడం వల్ల డ్రైవర్లకు మరింత శక్తి ఇంకా అవకాశాలు లభిస్తాయి" అని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications