ఈవీ స్టాక్ వెనుక పరిగెడుతున్న ఇన్వెస్టర్స్.. వారంలో డబ్బులు డబుల్, బ్రోకరేజ్ ఏమందంటే..
Ola Electric Mobility: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు ఈవీ రంగంలోని కంపెనీల షేర్లలో పెట్టుబడి అవకాశాలను అన్వేషిస్తున్నారు. మరోపక్క ఐపీవోల్లో కూడా ఇన్వెస్టర్లు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఒక కంపెనీ మాత్రం ఇన్వెస్టర్లను తన నిరంతర పెరుగుదలతో ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఓలా ఎలక్ట్రిక్ మెుబిలిటీ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. వాస్తవానికి ఈ కంపెనీ ఐపీవో ఆగస్టు 9, 2024న భారతీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించింది. లిస్టింగ్ తర్వాతి నుంచి ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న వేళ నేడు కూడా 10 అప్పర్ సర్క్యూట్ తాకింది. దీంతో కంపెనీ షేర్ల ధర శుక్రవారం రూ.123.76 ధర నుంచి రూ.146.03కి పెరిగాయి. దీంతో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.64,400 కోట్లకు ఎగబాకింది.

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ షేర్లు కేవలం 6 ట్రేడింగ్ సెషన్లలో 92 శాతం పెరుగుదలను చూశాయి. వాస్తవానికి కంపెనీ తన షేర్లను ఐపీవో సమయంలో ఒక్కోటి రూ.76కి ఇష్యూ చేసిన సంగతి తెలిసిందే. దలాల్ స్ట్రీట్ అరంగేట్రం తర్వాత ఆరు ట్రేడింగ్ సెషన్లలో.. 4 సెషన్లలో ఈ స్టాక్ అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. కంపెనీ జూన్ త్రైమాసికంలో రూ.347 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో EV ద్విచక్ర వాహన తయారీదారుల ఆదాయం 32.3 శాతం పెరిగి రూ.1,644 కోట్లకు చేరుకున్నాయి.
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీపై ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ HSBC తన కవరేజీని ప్రారంభించింది. లిస్టెడ్ ఆటోమొబైల్ మేకర్‌కు బ్రోకరేజ్ షేర్లకు BUY రేటింగ్ ఇవ్వటంతో చాలా మంది ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగుతున్నారు. బ్రోకరేజ్ కంపెనీ పనితీరుపై తన అంచనాలను పంచుకుంటూ.. EV తయారీ ఖర్చులు FY27/28 నాటికి గణనీయంగా తగ్గవచ్చని అభిప్రాయపడింది. ఓలా బ్యాటరీ వెంచర్ విజయవంతం కావచ్చని పేర్కొంది. ఈ క్రమంలో కంపెనీ షేర్లకు రూ.140 టార్గెట్ ధరగా బ్రోకరేజ్ అందించింది. ఇదే క్రమంలో నోమురా స్పందిస్తూ ఎలక్ట్రిక్ టూవీలర్ సెగ్మెంట్ టఫ్ పోటీని ఎదుర్కొంటని పేర్కొంది.


Click it and Unblock the Notifications