IPO News: మార్కెట్లోకి దూసుకొస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో.. సెబీ వద్ద దరఖాస్తు..
Ola Electric IPO: కొత్త ఏడాది కొత్త ఐపీవోలు దేశీయ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి. ఈ క్రమంలో దేశీయ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ దిగ్గజ కంపెనీ సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేస్తోంది.
అవును ఎలక్ట్రిక్ ద్విచక్రవాహన తయారీలో దిగ్గజంగా మెలుగుతున్న ఓలా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. భవిష్ అగర్వాల్ నేతృత్వంలో వేగంగా ఈవీ వాహన మార్కెట్లో ముందుకు సాగుతున్న సంస్థ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.5,500 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఇందుకోసం కంపెనీ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద దరఖాస్తు చేసుకున్నట్లు శుక్రవారం వెల్లడైంది. ఐపీవోల బూమ్ కొనసాగుతున్న వేళ పెట్టుబడిదారులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2008లో బజాజ్ ఆటో మార్కెట్ అరంగేట్రం తర్వాత వస్తున్న తొలి టూవీలర్ తయారీ కంపెనీ ఐపీవోగా ఓలా ఎలక్ట్రిక్ నిలవనుంది. సింగపూర్ పెట్టుబడి సంస్థ టెమాసెక్ మద్దతుతో ఇటీవలి నిధుల రౌండ్‌లో కంపెనీ విలువ 5.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. టూవీలర్ ఈవీల మార్కెట్లో ప్రస్తుతం ఓలా 32 శాతం వాటాను కలిగి ఉంది. ఇది టీవీఎస్, బజాజ్, ఏథర్ ఎనర్జీ వంటి కంపెనీలతో పోటీ పడుతోంది. కంపెనీ ఆర్థిక ఫలితాలను పరిశీలిస్తే.. మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి ఏకీకృత నష్టం రూ.1,472 కోట్లకు పెరిగినప్పటికీ.. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడు రెట్లు పెరిగింది.
తాజా ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయాన్ని మూలధన వ్యయం, Ola గిగాఫ్యాక్టరీ ప్రాజెక్ట్ కోసం OCT, అనుబంధ సంస్థ OET ద్వారా చేయబడిన రుణభారం పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించడం అవసరాల కోసం కంపెనీ వెచ్చించనుందని సమాచారం. ఈవీలకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం తగ్గించిన తర్వాత ధరలు పెరిగాయి. దీంతో లాభాలను సాధించాలనే లక్ష్యాన్ని కంపెనీ ఒక ఏడాది ఆలస్యం చేసింది. అలాగే మార్చి 2024 నాటికి 3 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను నమోదు చేయాలని కంపెనీ ఆశిస్తోంది.


Click it and Unblock the Notifications