Ola News: భారతీయ డెవలపర్లకు ఓలా బంపర్ ఆఫర్.. గూగుల్‌కు చెక్ పెట్టేలా భవిష్ ప్లాన్స్
Ola Maps: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో నావిగేషన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. సామాన్య ప్రజల నుంచి ప్రసిద్ధ కంపెనీల వరకు అందురూ ఏదో ఒక సందర్భంలో నిత్యం మ్యాప్స్‌ను ఉపయోగిస్తూ ఉంటాం. నావిగేషన్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. సాధారణ ప్రజానీకానికి ఇవి ఉచితమే అయినా పలు కంపెనీలు మాత్రం కొంత మొత్తం వెచ్చించాలని తెలుస్తోంది.
స్వయం సమృద్ధి దిశగా ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ఓలా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గతంలో వర్క్ లోడ్‌ని తన సొంత కృత్రిమ్ AI క్లౌడ్‌కు మార్చింది. అనంతరం మైక్రోసాఫ్ట్ అజూర్ సర్వీసుల నుంచి వైదొలిగింది. తాజాగా గూగుల్ మ్యాప్స్ వినియోగాన్ని సైతం బహిష్కరించింది. సొంతగా తయారుచేసుకున్న ఓలా మ్యాప్స్‌ను తమ సంస్థ అవసరాల కోసం ఉపయోగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది.

దీనికి తోడు ఓలా వ్యవస్థాపకులు మరియు CEO భవిష్ అగర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్ మ్యాప్స్ నుంచి ఓలా మ్యాప్స్‌కి మారమని డెవలపర్‌లను ప్రోత్సహించారు. కంపెనీ తన కృత్రిమ్ క్లౌడ్‌లో ఓలా మ్యాప్స్‌కి ఏడాది పాటు ఉచిత యాక్సెస్ సహా 100 కోట్లకు పైగా ఉచిత క్రెడిట్‌లను అందిస్తున్నట్లు చెప్పారు. భారతీయ డెవలపర్లు గూగుల్ మ్యాప్స్ నుంచి నిష్క్రమించే సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు Xలో పోస్ట్ చేశారు.
'భారత్‌ను మ్యాప్ చేయడానికి మేము చాలా కాలంగా విదేశీ యాప్‌లను ఉపయోగిస్తున్నాము. అయితే అవి మా ప్రత్యేక అవసరాలను తీర్చలేకపోతున్నాయి. వీధి పేర్లు, పట్టణాల మార్పులు, సంక్లిష్ట ట్రాఫిక్ అప్‌డేట్స్, ప్రామాణికం కాని రోడ్లు మొదలైనవి వీటిలో ఉన్నాయి. AI టెక్నాలజీ సహాయంతో ఓలా మ్యాప్స్ ఈ సమస్యలను అధిగమిస్తాయి. దీనికోసం నిర్దిష్ట అల్గారిథమ్‌లు, మిలియన్ల కొద్దీ వాహనాల నుంచి రియల్ టైమ్ డేటా, ఓపెన్ సోర్స్‌కు పెద్దఎత్తున దోహదపడుతున్నాయి' అని భవిష్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications