అమాంతం పెరిగిన క్రూడాయిల్ రేటు..పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు
ముంబై: దేశంలో మరోసారి ఇంధన ధరలు పెరిగే అవకాశం నెలకొంది. పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు మొలవడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వాహనదారులకు కొంత ఉపశమనం కలిగినప్పటికీ.. అది ఎంతోకాలం నిలవలేకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నెలలోనే వాటి రేట్లు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. దీనికి ప్రధాన కారణం- అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర భారీగా పెరగడమే.
బ్రెంట్ క్రూడాయిల్ ధర ఇవ్వాళ అమాంతంగా పెరిగింది. బ్యారెల్ ఒక్కింటికి 119.89 డాలర్లకు చేరింది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో బ్యారెల్ రేటు పెరగడం ఇదే తొలిసారి. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే- రెండు నెలల తరువాత క్రూడాయిల్ బ్యారెల్ ధర 120 డాలర్లకు చేరువ అయింది. దీనికి కారణాలు లేకపోలేదు. రోజుల తరబడి ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తూ వస్తోన్న రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేయడం.. వాటిని మరింత పెంచడానికి యూరోపియన్ యూనియన్ దేశాలు పావులు కదుపుతోంది.

యూరోపియన్ యూనియన్ దేశాలు త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నాయి. రష్యాపై ఆరో ప్యాకేజీ కింద మరిన్ని ఆంక్షలను విధించడానికి సమాయత్తమౌతున్నాయి. నిషేధాజ్ఞల తీవ్రతను పెంచబోతున్నాయి. సోమ, మంగళవారాల్లో ఈయూ సభ్య దేశాలు సమావేశమౌతాయంటూ వార్తలు వస్తున్నాయి. దీని ప్రభావం.. అంతర్జాతీయ మార్కెట్‌పై పడింది. క్రూడాయిల్ ధర ఒక్కసారిగా బ్యారెల్‌కు 119.89 డాలర్ల వరకు చేరింది.
గ్రీన్‌విచ్ మీన్‌టైమ్ జోన్ ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటకు బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 119.89 డాలర్లకు చేరింది. ఇదివరకటితో పోల్చుకుంటే 46 శాతం పెరుగుదల కనిపించింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ బ్యారెల్ ధర 60 శాతం పెరిగింది. 115.67 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఈ ధరల ఒత్తిడి- దేశీయ ఇంధన అమ్మకాలపై పడే అవకాశం లేకపోలేదని రిలయన్స్ బీపీ మొబిలిటి లిమిటెడ్ అభిప్రాయపడింది.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై అమలు చేస్తోన్న ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన విషయం తెలిసిందే. పెట్రోల్‌పై 8, డీజిల్‌పై 6 రూపాయల మేర తగ్గించింది. ఫలితంగా- వాటి రేట్లు దిగొచ్చాయి. సామాన్యులకు కాస్తో, కూస్తో అందుబాటులో ఉంటోన్నాయి. పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ వంద రూపాయలకు కాస్త అటు, ఇటుగా ఉంటోంది.


Click it and Unblock the Notifications