ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎంతో దూరంలో లేదు.. బ్లాక్‌రాక్ అధినేత సంచలన వ్యాఖ్యలు.. కారణం ఏంటంటే..
ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని శాసించే అతిపెద్ద ఆస్తి నిర్వహణ సంస్థ 'బ్లాక్‌రాక్' అధిపతి లారీ ఫింక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు రేపుతున్నాయి. సుమారు 14 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను పర్యవేక్షిస్తున్న ఆయనకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనంపై ఒక విశిష్టమైన అవగాహన ఉంది.
ఇటీవల బిబిసికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు బ్యారెల్‌కు 150 డాలర్ల స్థాయికి చేరుకుంటే, అది ప్రపంచవ్యాప్తంగా పెను ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే $104/bbl గా నమోదయింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అందులో ఇరాన్ పోషిస్తున్న పాత్ర భవిష్యత్తు ఇంధన ధరలను నిర్ణయించడంలో ఈ సారి కీలకం కానున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

మధ్యప్రాచ్య సంఘర్షణల పర్యవసానంగా చమురు ధరలు ఎలా ఉండబోతాయనే అంశంపై ఫింక్ రెండు భిన్నమైన కోణాలను ఆవిష్కరించారు. ఒకవేళ చర్చల ద్వారా వివాదాలు పరిష్కారమై, ఇరాన్ గనుక అంతర్జాతీయ సమాజంతో సత్సంబంధాలను పునరుద్ధరించుకుంటే, చమురు ధరలు యుద్ధానికి ముందు ఉన్న స్థాయి కంటే గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుంది.
అయితే, దీనికి విరుద్ధంగా ఉద్రిక్తతలు కొనసాగి, ఇరాన్ ముప్పు అలాగే ఉంటే మాత్రం, చమురు ధరలు రాబోయే కొన్నేళ్ల పాటు 100 నుండి 150 డాలర్ల మధ్యే కొనసాగవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు అత్యంత వేగవంతమైన, తీవ్రమైన Recession ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన విశ్లేషించారు.
ఇదే క్రమంలో సాంకేతిక రంగంలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి కూడా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. AI రంగంలో ఒక 'బబుల్' (అతిగా అంచనాలు పెరిగి కుప్పకూలడం) ఏర్పడిందన్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. అయితే విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుత తరం యువత ఎక్కువగా యూనివర్సిటీ డిగ్రీల వైపు మొగ్గు చూపుతున్నారని.. కానీ పరిశ్రమలకు అవసరమైన 'టెక్నికల్ ట్రైనింగ్' లేదా సాంకేతిక నైపుణ్యం కలిగిన వారు తగినంత సంఖ్యలో లేరని ఆయన స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకోవడం ఎంతో అవసరమని ఆయన సూచించారు.
ఇంధన భద్రత విషయంలో దేశాలు తమ స్వయంసమృద్ధిని పెంచుకోవాలని ఫింక్ అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న ప్రపంచ అస్థిరత నేపథ్యంలో, దేశీయంగా అందుబాటులో ఉన్న చమురు, గ్యాస్, ఇతర వనరులను గరిష్టంగా వినియోగించుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల ఆర్థిక వ్యవస్థలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
క్లుప్తంగా చెప్పాలంటే సామాన్యుడి జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా లేదా పారిశ్రామిక వృద్ధి సాధ్యపడాలన్నా, మార్కెట్‌లో 'చౌకైన ఇంధనం' అందుబాటులో ఉండటం అనేది ప్రాథమిక అవసరమని ఆయన స్పష్టం చేశారు. లారీ ఫింక్ చేసిన ఈ హెచ్చరికలు ప్రస్తుతం ప్రపంచ దేశాల పాలకులకు, పెట్టుబడిదారులకు ఒక మేలుకొలుపుగా మారాయి.


Click it and Unblock the Notifications