Gold: నోట్లో 82 గ్రాముల బంగారం.. ఎయిర్ పోర్టులో పట్టుబడ్డ వ్యక్తి..
దేశంలోకి అక్రమ మార్గాల ద్వారా వచ్చే బంగారం రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రతి రోజు ఏదో ఒక చోట అక్రమ బంగారాన్ని అధికారులు గుర్తిస్తున్నారు. తాజాగా బెంగళూరులో పసిడి స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతడి నుంచి భారీ స్థాయిలో పుత్తడిని స్వాధీనం చేసుకున్నారు. నోటిలో క్యాప్సూల్స్ పెట్టుకుని 82 గ్రాముల బంగారాన్ని దాచి, అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఒక భారతీయ ప్రయాణికుడిని బెంగళూరు విమానాశ్రయంలో బుధవారం CISF సిబ్బంది పట్టుకున్నారు. ఘజియాబాద్ వెళ్లే విమానం ఎక్కేందుకు సిబ్బంది భద్రతా తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1లో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
అతను దుబాయ్ నుంచి తెల్లవారుజామున వచ్చాడని తెలుస్తోంది. సాధారణ ప్రయాణీకుల భద్రతా తనిఖీ సమయంలో ఆ ప్రయాణికుడు అనుమానాస్పదంగా ప్రవర్తించడాన్ని అధికారులు తెలిపారు. తనిఖీ ప్రక్రియకు సరిగ్గా స్పందించకపోవడాన్ని CISF సిబ్బంది గమనించారని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారి తెలిపారు. ప్రయాణికుడి నోటిలో దాచి ఉంచిన సుమారు 82 గ్రాముల బరువున్న అనుమానిత బంగారం ఉన్న రెండు క్యాప్సూల్స్‌ను కనుగొన్నట్లు ఆ అధికారి తెలిపారు. తదుపరి విచారణ కోసం ఆ వ్యక్తిని స్థానిక పోలీసులకు అప్పగించినట్లు ఆయన చెప్పారు.

ఆ బంగారాన్ని స్వచ్ఛత పరీక్ష కోసం పంపినట్లు ఆయన తెలిపారు. దొరికిన బంగారం పరిమాణం తక్కువగానే ఉన్నప్పటికీ, అనుమానిత బంగారాన్ని దాచిపెట్టడానికి ఉపయోగించిన అసాధారణమైన, అరుదైన పద్ధతి కారణంగా ఈ కేసు ముఖ్యమైనదని సీఐఎస్ఎఫ్ అధికారులు వివరించారు. కాగా ఆ వ్యక్తిని ఓ అధికారి నోట్లో ఏం ఉందని అడగడం.. అతను నోట్లో నుంచి బంగారం కడ్డీలను బయటకు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఢిల్లీ ఎయిర్ పోర్టులో కూడా ఓ వ్యక్తి అక్రమంగా తీసుకొస్తున్న బంగారాన్ని ఎయిర్ పోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంవత్సరం మేలో బంగారం, వెండిపై ఉన్న దిగుమతి సుంకాన్ని కేంద్రం పెంచింది. అప్పటి నుంచి అక్రమంగా బంగారం ఇండియాకు తీసుకురావడం పెరిగింది. ఈ నేపథ్యంలోనే పసిడిపై ఉన్న దిగుమతి సుంకాన్ని తగ్గే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications