ఆగిన వర్క్ ఫ్రమ్ హోమ్.. బెంగళూరు టెక్కీల్లో అల్లకల్లోలం, జరుగుతోంది ఇదే..!!
Bengaluru Realty: భారతీయ సిలికాన్ వ్యాలీగా ఉన్న బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న అనేక కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా స్పష్టం చేశాయి. దీంతో వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ దాదాపుగా కనుమరుగైపోతోంది. దీంతో బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజులకు తీసుకోవటం పెరిగిన వేళ రేట్లు కూడా భారీగానే పెంచబడ్డాయి.
కరోనా తర్వాత చాలా కంపెనీలు తమ ఉద్యోగులను కొంత కాలం పాటు హైబ్రిడ్ వర్క్ విధానానికి అనుమతించాయి. అయితే ఇప్పుడు కంపెనీలు తమ ఉద్యోగులను పూర్తిగా ఆఫీసుల నుంచే పనిచేయాల్సిందిగా చెబుతున్నాయి. ఈ క్రమంలోనే టెక్ దిగ్గజ కంపెనీలు కొన్ని నెలల కిందట తమ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేశాయి. దీనితర్వాత ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న అనేక కంపెనీలు తమ ఉద్యోగులను తప్పక కార్యాలయం నుంచి పనిచేయించటం ప్రారంభించాయి. ఈ కారణంగా బెంగళూరులో ఆఫీసు లీజింగ్, అద్దెలు పెరిగాయి. ఈ పరిణామాలతో 2024 మొదటి మూడు త్రైమాసికాల్లో గ్రేడ్-A ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగింది.

ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం ఆఫీసుల స్పేస్ లీజింగ్ ఊపందుకుంది. టాప్- 6 నగరాల్లో ఆఫీస్ స్పేస్ కోసం డిమాండ్ 46.7 మిలియన్ చదరపు అడుగులకు పెరిగిందని తాజా నివేదికలు వెల్లడించాయి. కేవలం బెంగళూరులోనే 2024 మొదటి మూడు త్రైమాసికాల్లో 6.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు ఇవ్వబడింది. ఇన్నేళ్లలో బెంగళూరులో గరిష్టంగా ఆఫీస్ స్పేస్‌ను లీజుకు ఇవ్వడం ఇదే తొలిసారిగా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 31% పెరిగిందని ఈ రంగంలో పనిచేస్తున్న నిపుణులు తెలిపారు.
ప్రధానంగా టెక్ కంపెనీలు ఆఫీసు స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశం ఉండగ.. మరో పక్క గ్లోబల్ కంపెనీలు తమ భారతీయ శాఖలను ఏర్పాటు చేయడానికి బెంగళూరును ఎంచుకోవటం కూడా పెరుగుదలకు దారితీసిందని తెలుస్తోంది. విదేశీ కంపెనీలు తమ పరిశోధన అభివృద్ధి కార్యాలయాలు, సెమీకండక్టర్ రంగంలోని కంపెనీలు, డేటా సెంటర్లు, AI-ఆధారిత కంపెనీలను స్థాపించడానికి భారతదేశంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఒక్కసారిగా డిమాండ్ ఊపందుకుంది. దీనికి తోడు కంపెనీలు ఆఫీసులకు రావటాన్ని తప్పనిసరి చేయటంతో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందని తెలుస్తోంది. దీంతో బెంగళూరులోని ప్రధాన ప్రదేశాల్లో ఇంటి అద్దెలు పెరుగుదాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications