Realestate News: భాగ్యనగరంలో ఆఫీస్ స్పేస్‌కు మస్త్ డిమాండ్.. కోట్లు కుమ్మరించేందుకు రెడీ
Hyderabad News: దేశవ్యాప్తంగా రియల్ బూమ్ ఊపందుకుంది. ఎక్కడ చూసినా స్థలాల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒక మోస్తరు పట్టణాల నుంచి భారీ నగరాల వరకు సామాన్యుడు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇటీవల హైదరాబాద్ కోకాపేట్ లో ఎకరం 100 కోట్లు పలకడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయినప్పటికీ కార్పొరేట్ కంపెనీలు మాత్రం ఎంతైనా వెచ్చించి భాగ్యనగరానికి తరలి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తుండటం విశేషం.
నగరంలో IT సంస్థలకు నెలవైన హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఆఫీస్ స్పేస్ కు భారీ స్థాయిలో డిమాండ్ ఉంది. దిగ్గజ కంపెనీలు క్వాల్‌కామ్, S&P క్యాపిటల్, IBM మరియు LTI మైండ్ ట్రీ వంటి సంస్థలు కోట్లాది రూపాయలను అద్దెలుగా చెల్లించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ 4 కంపెనీలే దాదాపు 8.7 లక్షల చదరపు అడుగులు విస్తీర్ణాన్నిఆక్రమించాయి. గరిష్ఠంగా 3.15 కోట్లు వెచ్చించి లీజుకు తీసుకున్నట్లు సమాచారం.

హైటెక్ సిటీలోని స్కై వ్యూ బిల్డింగ్ లో 5 ఫ్లోర్లను ప్రముఖ అమెరికన్ సెమీ కండక్టర్ సాఫ్ట్వేర్ సంస్థ క్వాల్‌కామ్ సొంతం చేసుకుంది. ఇందుకుగాను 3.15 కోట్లు నెలవారీ అద్దె చెల్లించేందుకు సిద్ధమైంది. ముందస్తు డిపాజిట్ గా 16 కోట్లకు పైగా పే చేసింది. 15 ఏళ్ల పాటు లీజు కొనసాగనుండగా ఏటా 7 శాతం అద్దె పెంపునకు అంగీకరించింది. మరో US కంపెనీ S&P అనుబంధ సంస్థ నెలకు 1.77 కోట్లు చెల్లిస్తూ అదే బిల్డింగ్ లో 3 ఫ్లోర్లను లీజుకు తీసుకుంది. డిపాజిట్ గా పదిన్నర కోట్లు ముట్ట చెప్పి, ఐదేళ్ల కాలానికి అగ్రిమెంట్ చేసుకుంది.
అదే స్కై వ్యూ భవనంలో భారతీయ IT సంస్థ LTI మైండ్ ట్రీ లిమిటెడ్ కూడా పాగా వేసింది. 89 లక్షలకు పైగా అద్దెతో 2 ఫ్లోర్లలో ఆపరేట్ చేస్తుంది. 6.2 కోట్లు డిపాజిట్ కాగా 5 ఏళ్లపాటు లీజు కొనసాగుతుంది. ఏటా 5 శాతం వడ్డింపు వర్తిస్తుంది. IBM ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గచ్చిబౌలిలో ఆఫీస్ స్పేస్ సంపాదించింది. 2 ఫ్లోర్లకు గాను నెలవారీ 70 లక్షల అద్దె చెల్లించేందుకు అంగీకరించింది. 4 కోట్లకుపైగా సెక్యూరిటీ డిపాజిట్ పే చేసి ఏటా 4 శాతం అద్దె
పెంపుతో ఐదేళ్లపాటు కొనసాగనుంది.


Click it and Unblock the Notifications