Nykaa: దుమ్ముదులిపిన నైకా.. లాభాలతో పాటు ఆదాయం.. ఉచితంగా షేర్లు కూడా..
Nykaa: గత కొన్ని రోజులుగా నైకా షేర్ మార్కెట్లో సంచలనంగా మారింది. ఈ నెల యాంకర్ ఇన్వెస్టర్లకు లాక్ ఇన్ పిరియడ్ ముగిసే సమయం దగ్గర పడటంతో వరుసగా అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో అన్ని ఐపీవోల మాదిరిగానే ఇది కూడా నష్టాలను మిగుల్చుతుందని చాలా మంది ఆందోళన చెందారు.

త్రైమాసిక ఫలితాలు..
తాజాగా Nykaa జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు అద్బుత లాభాలను నమోదు చేయటంతో సీన్ రివర్స్ అయ్యింది. ఈ కాలంలో కంపెనీ ఏకంగా రూ.5.2 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం కేవలం రూ. కోటిగా ఉంది. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.5 కోట్లుగా ఉంది. ఈ వార్తల నేపథ్యంలో ఈ రోజు స్టాక్ ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో BSEలో 4% పెరిగి రూ.1,208ని తాకింది.

పెరిగిన ఆదాయం..
రెండవ త్రైమాసిక సమయంలో కంపెనీ లాభాలతో పాటు ఆదాయం సైతం భారీగా పెరిగింది. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి ఆదాయం రూ.885 కోట్లు ఉండగా.. అది ప్రస్తుతం 39% పెరిగి రూ.1,230 కోట్లకు చేరుకుంది. దీనికి తోడు క్వార్టర్ ఆన్ క్వార్టర్(QoQ) ఆదాయం 7% పెరిగి రూ.1,148.4 కోట్లకు చేరుకుంది. పండుగల సీజన్ కారణంగా కంపెనీ మంచి ఆదాయాన్ని గడించిందని తెలుస్తోంది.

గత కొన్ని నెలలుగా..
గడచిన కొన్ని నెలల కాలాన్ని పరిశీలిస్తే నైకా షేర్లు బాగా పడిపోయాయి. కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 60% పతనమయ్యాయి. అక్టోబర్ 28, 2022న Nykaa షేర్లు రూ. 975కి చేరుకున్నాయి. ఇది నైకా షేర్ల కొత్త 52 వారాల కనిష్ఠ ధర. కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.2,574గా ఉంది. అయితే Paytm, Zomato, Nykaa, PB Fintech, Delhivery సహా ఇతర న్యూ ఏజ్ టెక్ స్టాక్‌లు ఎక్కువగా నష్టపోతున్నాయి.

బోనస్ షేర్లు.
ఇటీవల 5:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇన్వెస్టర్లకు అందించేందుకు బోర్డ్ ఆమోదించింది. అంటే ఇన్వెస్టర్లు కలిగి ఉన్న ఒక్కో షేరుకు గాను 5 బోనస్ షేర్లు లభిస్తాయి. ఇందుకోసం కంపెనీ కట్ ఆఫ్ తేదీని నవంబర్ 3, 2022గా తొలుత నిర్ణయించింది. అయితే దీనిని నవంబర్ 11 వరకు పొడిగించింది. అయితే ఈ సమయంలో కంపెనీలో షేర్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులకు కంపెనీ అందించే బోనస్ షేర్లు పొందేందుకు అర్హులు.

యూటర్న్..
వరుసగా కొద్ది రోజులుగా పతనమవుతూ వచ్చిన స్టాక్ నిన్న ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది. అనూహ్యంగా స్టాక్ దాదాపు 20 శాతం లాభపడి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి కంపెనీ బోనస్ షేర్ల ప్రకటన కారణమని తెలుస్తోంది. ఇదే క్రమంలో నేడు విడుదలైన త్రైమాసిక ఫిలితాలు సైతం కంపెనీకి బలమైన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.


Click it and Unblock the Notifications