చైనీస్ టెక్నాలజీ కంపెనీల నుంచి తన H200 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్‌లకు భారీ డిమాండ్ రావడంతో.. ఆ అవసరాన్ని తీర్చేందుకు ఎన్‌విడియా (Nvidia) ఉత్పత్తిని పెంచే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఈ క్రమంలోనే ప్రపంచంలో అతిపెద్ద కాంట్రాక్ట్ చిప్ తయారీదారు అయిన తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ (TSMC)తో అదనపు ఉత్పత్తి ఆర్డర్లపై చర్చలు జరిపిందని అనధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ సమాచారం ప్రకారం.. 2026 సంవత్సరానికి గాను చైనా టెక్ కంపెనీలు ఇప్పటికే 2 మిలియన్లకు పైగా H200 చిప్‌ల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. అయితే ప్రస్తుతం Nvidia వద్ద కేవలం 7 లక్షల (700,000) యూనిట్ల స్టాక్ మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో TSMC నుంచి Nvidia ఆర్డర్ చేయదలచుకున్న అదనపు చిప్‌ల ఖచ్చితమైన సంఖ్య ఇంకా ఖరారు కాలేదని వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ, అదనపు ఉత్పత్తిని ప్రారంభించమని Nvidia ఇప్పటికే TSMCని కోరినట్లు, అలాగే 2026 రెండో త్రైమాసికంలో ఈ ఉత్పత్తి మొదలయ్యే అవకాశముందని మరో వర్గం పేర్కొంది.

చైనాలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే కాకుండా, ఇతర దేశాల్లో సరఫరా పరిమితులను సమతుల్యం చేయాల్సిన పరిస్థితి Nvidia ముందుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా AI చిప్‌ల సరఫరా మరింత కఠినతరం అయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. చైనాకు H200 చిప్‌ల ఎగుమతులపై నియంత్రణ అంశం ఇంకా పూర్తిగా తేలలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఇటీవల చైనాకు H200 ఎగుమతులను అనుమతించినప్పటికీ.. బీజింగ్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ అనిశ్చితి Nvidiaకి ఆర్థికపరమైన ప్రమాదాన్ని కూడా పెంచుతోంది.
ఇప్పటివరకు వెలుగులోకి రాని ఈ చర్చలు.. చైనా డిమాండ్ వివరాలు, ధరల అంశాలను రాయిటర్స్ ప్రత్యేకంగా వెల్లడించింది. చైనీస్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన H200 వేరియంట్ల ధర ఒక్కో చిప్‌కు సుమారు 27,000 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై స్పందించిన Nvidia ప్రతినిధి మాట్లాడుతూ.. తమ సరఫరా గొలుసును నిరంతరం సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
చైనాలో అధీకృత కస్టమర్లకు లైసెన్సుతో జరిగే H200 అమ్మకాలు, అమెరికాలోని మా కస్టమర్లకు సరఫరాపై ఎలాంటి ప్రభావం చూపవని ఆయన స్పష్టం చేశారు. అలాగే, అన్ని అమెరికా ఎగుమతులను నిలిపివేయడం జాతీయ, ఆర్థిక భద్రతకు హానికరమని, విదేశీ పోటీదారులకు మాత్రమే లాభం చేకూరుతుందని వ్యాఖ్యానించారు.TSMC మాత్రం ఈ అంశంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. అలాగే, చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి కూడా తక్షణ స్పందన రాలేదు. ఈ కథనం కోసం రాయిటర్స్ ఐదుగురు వర్గాలతో మాట్లాడగా.. చర్చలు గోప్యంగా ఉన్నందున వారు తమ పేర్లు వెల్లడించలేదు.
ఈ కొత్త ఆర్డర్ Nvidia తన కొత్త బ్లాక్‌వెల్, రాబోయే రూబిన్ చిప్‌లపై దృష్టి సారిస్తున్న సమయంలో, పాత తరం హాప్పర్ ఆర్కిటెక్చర్‌కు చెందిన H200 ఉత్పత్తిలో గణనీయమైన విస్తరణకు దారితీయనుంది. H200 చిప్‌లు TSMC యొక్క 4-నానోమీటర్ తయారీ ప్రక్రియతో ఉత్పత్తి అవుతున్నాయి. ఏదేమైనా చైనాలో AI రంగం వేగంగా విస్తరిస్తుండటంతో Nvidia-TSMC మధ్య ఈ చర్చలు ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమలో కీలక మలుపుగా మారే అవకాశముంది.


Click it and Unblock the Notifications