Nvidia Bonus: 1 కోటి రూపాయల బోనస్! ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఎన్విడియా! కారణం ఇదే!
ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , సెమీకండక్టర్ల మాటే వినిపిస్తోంది. ఈ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న అమెరికన్ చిప్ దిగ్గజం ఎన్విడియా (Nvidia), తన భారతీయ ఉద్యోగులపై కాసుల వర్షం కురిపించింది. భారత్‌లో పనిచేస్తున్న సుమారు 10,000 మంది ఉద్యోగులకు కంపెనీ సీఈఓ జెన్సన్ హువాంగ్ 'స్పెషల్ స్టాక్ బోనస్'లను ప్రకటించారు. ఈ బోనస్‌ల విలువ రూ. 5 లక్షల నుంచి ఏకంగా రూ. 1 కోటి వరకు ఉండటం గమనార్హం.

ఏమిటీ 'జెన్సన్ స్పెషల్ గ్రాంట్'?
2024లో ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక పథకం ద్వారా ఉద్యోగులకు వారి ప్రాథమిక రెస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్ (RSUs) పై అదనంగా 25 శాతం షేర్లను కంపెనీ బహుమతిగా ఇస్తోంది. దీనిని 'జెన్సన్ స్పెషల్ గ్రాంట్' అని పిలుస్తారు. ఈ షేర్లు వచ్చే నాలుగేళ్ల కాలంలో (Vesting Period) ఉద్యోగుల అకౌంట్లలో జమ అవుతాయి. ఒక డాలర్ విలువను రూ. 82.9 గా లెక్కించి, కంపెనీ సగటు షేర్ ధర $898.2 వద్ద ఉన్నప్పుడు ఈ కేటాయింపులు జరిగాయి.
జీతం కంటే షేర్లే ముఖ్యం!
ఎన్విడియా ఇండియాలో పనిచేసే మిడ్ , సీనియర్ లెవల్ ఉద్యోగుల జీతాల నిర్మాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీరి మొత్తం ఆదాయంలో (Total Compensation) 50 శాతం నుంచి 75 శాతం వరకు కేవలం ఎన్విడియా స్టాక్ (Nvidia stock) రూపంలోనే ఉంటుంది. అంటే ఫిక్స్‌డ్ శాలరీ కంటే స్టాక్ రూపంలో వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉంటోంది. ఉదాహరణకు, ఒక మిడ్-లెవల్ సొల్యూషన్స్ ఆర్కిటెక్చర్ ఉద్యోగికి తన వార్షిక జీతంతో పాటు అదనంగా రూ. 21.5 లక్షల విలువైన షేర్లు, దానికి తోడు ఇప్పుడు వచ్చిన స్పెషల్ గ్రాంట్ కింద మరో రూ. 5.3 లక్షల విలువైన షేర్లు లభించాయి. ఇలా మొత్తం కలిపి ఒక సామాన్య టెక్కీ వద్ద ఉన్న అన్‌వెస్టెడ్ షేర్ల విలువ రూ. 1.2 కోట్లు దాటిపోయింది.
ఎంతెంత జీతాలు?
6figr డేటా ప్రకారం, ఎన్విడియాలో చిప్ డిజైన్ , AI ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేసే టాప్ ఇంజనీర్లు ఏటా రూ. 2 కోట్లకు పైగా సంపాదిస్తున్నారు.
- IC1 (0-3 ఏళ్ల అనుభవం): రూ. 10 లక్షల నుంచి రూ. 22 లక్షలు.
- IC2 (1-8 ఏళ్ల అనుభవం): రూ. 23 లక్షల నుంచి రూ. 32 లక్షలు.
- IC3 (మిడ్-లెవల్): రూ. 27 లక్షల నుంచి రూ. 51 లక్షలు. టాప్ పెర్ఫార్మర్స్ రూ. 85 లక్షల వరకు అందుకుంటున్నారు.
- IC6 (సీనియర్ లెవల్): సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సగటున రూ. 1.8 కోట్లు ఆర్జిస్తున్నారు.
సంపద సృష్టికి కొత్త మార్గం
గతంలో షేర్లు అనేవి కేవలం ఉద్యోగులను కంపెనీలో ఉంచుకోవడానికి (Retention Tool) ఇచ్చేవారు. కానీ ఇప్పుడు డీప్-టెక్ రంగంలో ఇవే ప్రధాన ఆదాయ వనరుగా మారాయని కెపిఎమ్‌జి (KPMG) నిపుణులు చెబుతున్నారు. నగదు రూపంలో ఇచ్చే జీతం కంటే కంపెనీ పనితీరుపై ఆధారపడి ఇచ్చే ఈ ఈక్విటీలే ఉద్యోగులను కోటీశ్వరులను చేస్తున్నాయి. ఐటీ రంగంలో వస్తున్న ఈ మార్పు భారతీయ ప్రతిభావంతులకు ప్రపంచ స్థాయిలో గుర్తింపును, ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది.
మొత్తంగా చూస్తే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఎన్విడియా స్టాక్స్ (Nvidia stock) ధరలు గత కొంతకాలంగా రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. కంపెనీ ఎదుగుదలలో భాగస్వాములైన ఉద్యోగులకు ఇలాంటి ప్రోత్సాహకాలు అందించడం వల్ల వారి పనితీరు మరింత మెరుగుపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎన్విడియా ఇచ్చిన ఈ స్పెషల్ గ్రాంట్ మిగిలిన టెక్ కంపెనీలకు కూడా ఒక రోల్ మోడల్‌గా నిలవనుంది.


Click it and Unblock the Notifications