Stock Market: మార్కెట్లోకి మరో స్కామ్.. 'డబ్బా ట్రేడింగ్' పేరిట సొంత సెటప్
Stock Market: ఈక్విటీ, ఫ్యూచర్స్ & ఆప్షన్స్, కమొడిటీస్, కరెన్సీ వంటి పలు రకాల అసెట్లను ఫైనాన్షియల్ మార్కెట్లలో ట్రేడ్ చేస్తుంటారు. రోజూ కోట్లాది రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. ఇదే సమయంలో పలువురు మోసగాళ్లు సైతం పెట్టుబడిదారులను ఆకర్షించి, వారి కష్టార్జితాన్ని లూటీ చేయడానికి పొంచి ఉంటారు. వారిపట్ల జాగ్రత్తగా ఉండటం కోసం ఎప్పటికప్పుడు నియంత్రణ సంస్థలు వినియోగదారులను అప్రమత్తం చేస్తూనే ఉంటాయి.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడిపెట్టే నిధులకు రాబడిపై గ్యారంటీ ఉండదు. మార్కెట్ వాలటాలిటీ ఆధారంగా రిటర్న్ నిర్ణయించబడుతుంది. కానీ కొందరు మోసగాళ్లు మాత్రం హామీతో కూడిన సంపాదన ఇస్తామంటూ చీటింగ్ కు పాల్పడుతున్నారు. వీరిపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ఇన్వెస్టర్స్ కు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) సూచించింది. ఈ తరహా 'డబ్బా ట్రేడింగ్' నిర్వాహకులను నమ్మవద్దని కోరింది.

డబ్బా ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్ పేరిట జరిగే ఓ అక్రమ వ్యాపారం. ఎక్స్ఛేంజ్ లలో కాకుండా సొంతగా తయారు చేసుకున్న ప్లాట్ ఫారమ్స్ ను వినియోగించి ట్రేడింగ్ జరుపుతారు. వీటి నిర్వహణకు ఎటువంటి అనుమతులు ఉండవు, పెట్టుబడిదారుల సొమ్ముకు ఎవరూ బాధ్యత వహించరు. ఇదొక జూదం వంటిదన్నమాట. అందుకే చట్టవిరుద్ధంగా ఏర్పాటైన ఏ విధమైన సాధనాల్లోనూ డబ్బు పెట్టి, మోసపోవద్దని NSE హెచ్చరించింది.
శ్రీ పరస్నాథ్ కమోడిటీ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ పరస్నాథ్ బులియన్ ప్రైవేట్ లిమిటెడ్, ఫారీ టేల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు భరత్ కుమార్ (ట్రేడ్ విత్ ట్రస్ట్) అనే సంస్థలు డబ్బా ట్రేడింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించామని NSE తెలిపింది. వాటికి సంబంధించిన ఎవరికీ ఎక్స్ఛేంజ్ లో సభ్యత్వం లేదని వెల్లడించింది. ఆయా సంస్థలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది.


Click it and Unblock the Notifications