గోల్డ్ మార్కెట్‌లో సరికొత్త విప్లవం! నేటి నుంచే NSE లో 'ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్' ట్రేడింగ్!
భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు.. అదొక సెంటిమెంట్, ఆపత్కాల నిధి. అయితే, భౌతికంగా బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటే ప్యూరిటీ (నాణ్యత) సమస్యలు, దొంగల భయం, లాకర్ ఫీజులు వంటి ఎన్నో తలనొప్పులు ఉంటాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ఈరోజు (మే 18) ఒక సరికొత్త డిజిటల్ విధానాన్ని లాంచ్ చేసింది. అదే.. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR).
ఈ సరికొత్త గోల్డ్ ట్రేడింగ్ విధానం ద్వారా సామాన్య ఇన్వెస్టర్లు, జ్యువెలర్లు, బులియన్ వ్యాపారులు ఎవరైనా సరే.. డిజిటల్ రూపంలో బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. షేర్ మార్కెట్ లాగే సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9:00 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు (యూఎస్ డేలైట్ సేవింగ్స్ సమయంలో రాత్రి 11:55 వరకు) ఈ ట్రేడింగ్ సాగుతుంది. ఇది T+1 సెటిల్‌మెంట్ సైకిల్ కింద పనిచేస్తుంది.

అసలు EGR అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్ (EGR) అనేది సింపుల్‌గా చెప్పాలంటే.. మీ బంగారానికి సంబంధించిన ఒక డిజిటల్ డాక్యుమెంట్ (రసీదు). మీరు కొనే ప్రతి EGR వెనుక, సెబీ (SEBI) గుర్తింపు పొందిన వాల్ట్ (భద్రతా గిడ్డంగుల)లో అంతే పరిమాణంలో అసలైన ఫిజికల్ గోల్డ్ దాచబడి ఉంటుంది.
మీరు కొన్న బంగారం మీ డిమ్యాట్ (Demat) అకౌంట్‌లో షేర్ల లాగే కనిపిస్తుంది. ఈ రిసీట్లు 1 కిలోగ్రామ్, 100 గ్రాములు, 10 గ్రాములు, 1 గ్రాము, చివరికి 100 మిిల్లీగ్రాముల వంటి రకరకాల సైజుల్లో లభిస్తాయి. కాబట్టి చిన్న ఇన్వెస్టర్లు కూడా చాలా తక్కువ బడ్జెట్‌తో ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఇతర గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కంటే ఇది ఎలా డిఫరెంట్?
మార్కెట్లో ఇప్పటికే ఫిజికల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌లు (ETFs), మ్యూచువల్ ఫండ్స్, సావరిన్ గోల్డ్ బాండ్‌లు (SGB) వంటి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. కానీ EGR ప్రత్యేకత ఏంటంటే.. ఇది నేరుగా ఫిజికల్ గోల్డ్ బ్యాకప్‌తో వస్తుంది. అంటే మీకు అవసరమైనప్పుడు ఈ డిజిటల్ రిసీట్లను ఇచ్చేసి, వాల్ట్ నుండి ఒరిజినల్ కాయిన్స్ లేదా బిస్కెట్ల రూపంలో బంగారాన్ని ఫిజికల్ గా విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన సవాళ్లు..
- లిక్విడిటీ సమస్య: మార్కెట్ కొత్తది కాబట్టి కొనుగోలుదారులు, అమ్మకందారులు భారీ సంఖ్యలో వచ్చేంత వరకు లిక్విడిటీ (తక్షణమే నగదుగా మార్చుకునే సదుపాయం) కాస్త తక్కువగా ఉండొచ్చు.
- టాక్స్ రూల్స్: ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్‌లపై EGR ట్రేడింగ్ చేయడానికి ఎలాంటి జీఎస్టీ (GST) ఉండదు. కానీ, మీరు ఆ డిజిటల్ రిసీట్‌ను ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకోవాలి (విత్‌డ్రా చేసుకోవాలి) అనుకుంటే మాత్రం 3 శాతం GST కట్టాల్సి ఉంటుంది.
- మైండ్ సెట్ మారాలి: మన దేశంలో బంగారాన్ని చేత్తో పట్టుకుని చూస్తేనే ఆ తృప్తి వేరు అనుకుంటారు. డిజిటల్ రూపంలో దాచుకోవడానికి అలవాటు పడటానికి కాస్త సమయం పడుతుంది.
NSE మాటల్లో చెప్పాలంటే..
ఎన్‌ఎస్‌ఈ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ మాట్లాడుతూ.. ఈ EGR ఫ్రేమ్‌వర్క్ వల్ల దేశవ్యాప్తంగా ఒకే రకమైన పారదర్శక ధరలు అందుబాటులోకి వస్తాయని, ఇన్వెస్టర్లకు భద్రతతో కూడిన కొత్త పెట్టుబడి మార్గం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications