ఏపీలో ఆర్టీసీ విలీనం: పెన్షన్ పథకం ఇక మీ ఇష్టం, ఆ డబ్బు కూడా కార్మికులకే!
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులకు పాత లేదా కొత్త పెన్షన్ ఎంచుకునే వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయనున్న విషయం తెలిసిందే. ఆర్టీసీ విలీనంపై వేసిన కమిటీ పలు సూచనలు చేసింది. ఇందులో పెన్షన్ ప్లాన్ విషయంలోను సూచన చేసిందని తెలుస్తోంది. పెన్షన్‌తో పాటు ఇతర ప్రయోజనాలకు సంబంధించి అధికారులు పలు సూచనలు చేశారట.

అమలులో పీఎఫ్
ప్రస్తుతం ఆర్టీసీలో పీఎఫ్ అమలులో ఉంది. ఉద్యోగి వాటా కింద వేతనంలో 12 శాతం కట్ అవుతుంది. యాజమాన్య వాటా కింద 12 శాతం యాడ్ అవుతుంది. ఇందులో యాజమాన్య వాటాలో 8.33 శాతం ఈపీఎఫ్‌కు వెళ్తుంది. మిగతా మొత్తం ఆర్టీసీలోని పీఎఫ్ ట్రస్టులో ఉంటుంది. పీఎఫ్ ట్రస్టులో రూ.1,200 కోట్ల వరకు ఉంది. వివిధ అవసరాల కోసం ఇందులోని కొంత మొత్తాన్ని ఇప్పటికే వాడుకున్నారు.

వారికి పెన్షన్‌గా
ఈపీఎఫ్ కింద చెల్లించే 8.33 శాతం నుంచి నేషనల్ పెన్షన్ స్కీం (NPS) కింద కొంత మొత్తాన్ని రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్‌గా వస్తోంది. ఆర్టీసీ విలీనం తర్వాత భాగస్వామ్య పెన్షన్ విధానం (CPS) అమలు చేయాల్సి ఉంటుంది. అయితే కార్మికులకు ఈ రెండింటిలో వారికి ఇష్టమున్న పెన్షన్ విధానాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది.

ఆ డబ్బు తిరిగిస్తారు
NPSకు 8.33 శాతం కాకుండా ఆర్టీసీలో కార్మికులు ప్రతి నెల పదవీ విరమణ ప్రయోజన పథకం కింద-SRBS వేతనం నుంచి కొంత చెల్లిస్తారు. ప్రస్తుతం రూ.250 చెల్లిస్తున్నారు. పదవీ విరమణ అనంతరం రూ.2,800 నుంచి రూ.3,200 వరకు పెన్షన్ ఇస్తారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైతే ఈ పథకం రద్దవుతుంది. SRBS కింద చెల్లించిన డబ్బును కార్మికులకు తిరిగి ఇవ్వనున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications