NPS News: గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన పలు నిబంధనల్లో సవరణలు చేసింది. EPF నుంచి NPS వరకు రూల్స్ మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్నింటిపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే మరికొన్ని మాత్రం సిబ్బందికి మేలు జరిగేలా దశాబ్దం నాటి నియమాలను ఛేంజ్ చేసింది. కాగా ఇప్పుడు NPS గురించి మరో కీలక ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద కవర్ చేయబడిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. వారు చివరగా పొందిన వేతనంలో 50 శాతాన్ని పెన్షన్‌గా స్వీకరించే విధంగా రూల్ తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యోగుల పేఅవుట్ అసమానతలపై ఆందోళనలను పరిష్కరించడానికి ఈ విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

పాత పెన్షన్ స్కీమ్ (OPS)ని తిరిగి అందుబాటులోకి తీసుకురావడాన్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆర్థిక సంఘం సిఫార్సులతో దీనికి కొన్ని సర్దుబాట్లు చేసినట్లు నివేదిక పేర్కొంది. NPSలో ఉద్యోగులు వారి ప్రాథమిక జీతంలో 10 శాతం విరాళంగా అందిస్తారు. దీనికి ప్రభుత్వం నుంచి 14 శాతం షేర్ యాడ్ అవుతుంది. కాగా ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ అధ్యక్షతన ఒక కమిటీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత ఈ మేరకు ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం.
సోమనాథన్ కమిటీ వివిధ దేశాల్లోని పద్ధతులను సమీక్షించి, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన మార్పుల ఫలితాలను అధ్యయనం చేసిందని నివేదిక పేర్కొంది. 25-30 ఏళ్లలోపు సేవలందించే ఉద్యోగులకు వారు డ్రా చేసిన చివరి వేతనంలో 50 శాతానికి ప్రభుత్వం త్వరలో హామీ ఇవ్వగలదని భావిస్తున్నట్లు చెప్పింది. అదనంగా ఆర్థిక స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు కార్పొరేట్ రిటైర్మెంట్ ప్రయోజనాల వంటి ప్రత్యేక నిధిని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications