UPI News: యూపీఐ కొత్త రూల్స్.. ఫిబ్రవరి నుంచి అవి బంద్, వెంటనే ఈ విషయం తెలుసుకోండి..!
UPI Transaction ID's: భారతదేశంలో యూపీఐ ప్రవేశం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం ప్రజల రోజువారీ జీవితంలో ఇది సర్వసాధారణ భాగంగా మారిపోయింది. మరో పక్క ఇవి మోసగాళ్ల చేతిలో ఆయుధాలుగా కూడా మారిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు చదువుకున్న వ్యక్తులను సైతం కొత్త ప్రణాళికలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్పీసీఐ యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజా సర్క్యులర్ జాగ్రత్తగా పరిశీలిస్తే.. స్పెషల్ క్యారెక్టర్లతో క్రియేట్ చేయబడిన యూపీఐ ఐడిల ద్వారా చేసే లావాదేవీలు ఫిబ్రవరి 1, 2025 నుంచి నిలిచిపోనున్నాయి. ఇకపై కేవలం అక్షరాలతో పాటు నంబర్లను మాత్రమే యూపీఐ ఐడీకి వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నిబంధన ప్రకారం యూజర్లు స్పెషల్ క్యారెక్టర్లతో నిర్మించిన ఐడీలో పనిచేయవని తెలుస్తోంది. ఇప్పటికే ఎన్పీసీఐ ఏడాది నుంచి వినియోగంలో లేని ఐడీలను తొలగిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రజలకు చెల్లింపులను సులభతరం, వేగవంతం చేయటంలో యూపీఐ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇండియాలో విజయవంతమై, తక్కువ ఖర్చులో అందుబాటులో ఉన్న టెక్నాలజీని ప్రపంచ దేశాలు కూడా అందిపుచ్చుకోవటానికి ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే భారత్ యూపీఐ చెల్లింపు వ్యవస్థను కొన్ని దేశాల్లో అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఒక్క క్లిక్ తో డబ్బు చెల్లింపును సులభతరం, వేగవంతం చేసింది. చిన్న వీధి దుకాణాల నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్ని చోట్ల ఈ వ్యవస్థ ద్వారా చెల్లింపులు స్వీకరించబడుతున్నాయి.
వాస్తవానికి 2016లో మోదీ సర్కార్ పెద్ద నోట్లను వెనక్కి తీసుకుంటూ డీమానిటైజేషన్ ప్రకటించిన తర్వాత ప్రజలు ఎక్కువగా యూపీఐ చెల్లింపులకు మళ్లారు. దీంతో లావాదేవీల సంఖ్య, వాటి విలువ కూడా భారీగానే పెరిగిపోయాయి. అయితే ప్రస్తుతం చాలా మంది యూజర్లు తమ యూపీఐ ఐడీల్లో నంబర్లు, అక్షరాలతో పాటు స్పెషల్ క్యారెక్టర్లను కూడా వినియోగిస్తున్నారు. అందుకే ఇకపై స్పెషల్ క్యారెక్టర్ల వినియోగాన్ని నిలిపివేసేందుకు కొత్తగా నిర్ణయం తీసుకుంది. దీనిని పాటించాల్సిందేనని ఎన్పీసీఐ దేశంలోని అన్ని బ్యాంకింగ్ సంస్థలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
యూపీఐ వాడుతున్న చాలా మంది ప్రతి నెల చేసే చెల్లింపులు అంటే యుటిలిటీ చెల్లింపులైన గ్యాస్, ఇంటర్నెట్, మెుబైల్ రీచార్జ్, డీజీహెచ్ చెల్లింపులు, కరెంటు బిల్లులు, ఇంటి అద్దె వంటి నిరంతరం చేయాల్సిన చెల్లింపుల విషయంలో ఆటోపే సేవలను వినియోగించుకుంటున్నారు. యూపీఐ ఐడీ మార్పులు సకాలంలో చేసుకోకపోతే ఇవి ఫెయిల్ అయ్యే అవకాశం ఉండొచ్చు. మోసగాళ్లు కూడా ఆటోపే విధానాన్ని ప్రజలను మోసం చేసేందుకు, అక్రమంగా వారి నుంచి డబ్బు తస్కరించేందుకు వినియోగించుకున్న వేళ వీటితో జాగ్రత్తగా ఉండటం అత్యవసరం. మెుత్తానికి యూపీఐ ఐడీల విషయంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మార్పులు చేయకపోతే చెల్లింపులు డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి.


Click it and Unblock the Notifications