WPI Inflation: నవంబరులో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం పాజిటివ్.. 8 నెలల గరిష్ఠానికి..
Inflation News: దేశంలో తాజాగా టోకు ధరల ద్రవ్యోల్బణం వివరాలు విడుదలయ్యాయి. ఈ క్రమంలో నవంబరులో ధరలు పెరగటం కొంత ఆందోళనలు కలిగిస్తోంది.
వాస్తవానికి నవంబరులో హోల్ సేల్ ద్రవ్యోల్బణం పెరిగి 0.26 శాతంగా నమోదైంది. ఈ క్రమంలో ఏడు నెలల తర్వాత తొలిసారిగా పాజిటివ్ గా మారింది. ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల్లో అత్యంత వేగంగా నవంబర్‌లో 0.26 శాతానికి చేరుకోవటానికి ఆహార వస్తువులు, ఖనిజాలు, యంత్రాలు, పరికరాలు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఆప్టికల్ ఉత్పత్తులు, మోటారు వాహనాలతో పాటు ఇతర పరికరాల ధరల పెరుగుదల కారణంగా వెల్లడైంది.

అక్టోబరులో టోకు ద్రవ్యోల్బణం -0.52 శాతంగా, సెప్టెంబరులో -0.26 శాతంగా ఉంది. అక్టోబర్ 2023తో పోల్చితే నవంబర్ 2023లో డబ్ల్యుపీఐ ఇండెక్స్‌లో నెలవారీ మార్పు 0.53 శాతంగా ఉందని వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆహార సూచీ ఆధారిత డబ్ల్యుపీఐ అక్టోబర్‌లో 1.07 శాతం నుంచి నవంబర్‌లో 4.6 శాతానికి పెరిగింది. ప్రైమరీ ఆర్టికల్స్ గ్రూప్ నుంచి ఫుడ్ ఆర్టికల్స్, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ గ్రూప్ నుంచి 'ఫుడ్ ప్రొడక్ట్'తో కూడిన ఫుడ్ ఇండెక్స్ అక్టోబర్‌లో 179.6 నుంచి నవంబర్‌లో 183.1కి పెరిగింది. ఇందులో తృణధాన్యాలు, వరి, గోధుమలు, పప్పులు, కూరగాయలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పండ్లు, పాలు, గుడ్లు, మాంసం, చేపలు వంటి ఉత్పత్తులు ఉంటాయి.
ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 2.53 శాతం నుంచి నవంబర్‌లో 8.18 శాతానికి పెరిగింది. ఇంధనం & పవర్ ఇండెక్స్ అక్టోబర్‌లో 154.1 నుంచి నవంబర్‌లో 0.78 శాతం పెరిగి 155.3కి చేరుకుంది. అయితే విద్యుత్ ధరలు 9.93 శాతం పెరగగా.. మినరల్ ఆయిల్స్ -1.99 శాతం తగ్గాయి. తయారీ ఉత్పత్తుల సూచీ అక్టోబర్‌లో 140.3 నుంచి నవంబర్‌లో 0.07 శాతం పెరిగి 140.4కి చేరుకుంది. ఇదే క్రమంలో ప్రాథమిక లోహాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, వస్త్రాలు, ఇతర నాన్-మెటాలిక్ ఖనిజ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టాయి.


Click it and Unblock the Notifications