Viral post: ఉపాధి లేక నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏ చిన్న జాబ్ దొరికినా చాలని కాళ్లరిగేలా ఇంటర్వ్యూల చుట్టూ తిరిగేవారు ఎందరో ఉన్నారు. అయితే మరికొందరు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా బతికేస్తున్నారు. ప్రతినెలా లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్నా ఏమాత్రం సరిపోవడం లేదంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సౌరవ్ దత్తా అనే ఇన్వెస్టర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా కనిపిస్తారు. ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. 25 LPA జీతం అంటే నెలకు దాదాపు 1.5 లక్షల టేక్-హోమ్ తనకు ఏమాత్రం చాలడం లేదని తన బాధను వెళ్లగక్కారు. ప్రాథమిక ఖర్చులను కవర్ చేసిన తర్వాత సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ కోసం తనవద్ద ఏమీ మిగలడం లేదని వాపోయారు.

'ముగ్గురు కుటుంబ సభ్యులున్న మాకు నిత్యావసర వస్తువులు, EMIలు, అద్దెల కోసం 1 లక్ష మేర ఖర్చు చేయాల్సి వస్తోంది. భోజనం, సినిమాలు, OTT, రోజువారీ పర్యటనల కోసం మరో 25 వేలు ఖర్చవుతోంది. ఇక అత్యవసర పరిస్థితులు మరియు వైద్యం కోసం మరో 25 వేలు వెచ్చించాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీంతో పెట్టుబడి కోసం కొంత మొత్తాన్ని పక్కన పెట్టలేకపోతున్నా' అని Xలో పోస్ట్ చేశారు.
ఆయన పోస్ట్‌పై ప్రస్తుతం వివాదం చెలరేగింది. ముగ్గురు సభ్యుల కుటుంబాన్ని పోషించడానికి ఏడాదికి 25 లక్షల జీతం సరిపోదని చెప్పడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా మరికొందరు పెరుగుతున్న జీవన వ్యయం మరియు ద్రవ్యోల్బణాన్ని లెక్కగడుతూ దత్తా అంచనాతో ఏకీభవిస్తున్నారు. ఇంకొందరైతే ఆయన లెక్కలను సవాలు చేశారు. పాతిక లక్షలు సంపాదించే తెలివి కలిగిన వ్యక్తికి వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణ తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications