Norway Wealth Fund: 2023లో అదానీ గ్రూప్ అనేక ఆరోపణలు, ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వీటి నుంచి కంపెనీ ఈ ఏడాది విముక్తిని పొంది ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపగలిగింది. అయితే ఈ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. తాజాగా అదానీ గ్రూప్‌లోని కీలకమైన కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
గౌతమ్ అదానీ నేతృత్వంలో కొనసాగుతున్న కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వాస్తవానికి నార్వే $1.7 ట్రిలియన్ సావరిన్ వెల్త్ ఫండ్ అదానీ పోర్ట్స్‌ను దాని పోర్ట్‌ఫోలియో నుంచి రిస్క్ కారణంగా బ్లాక్ లిస్ట్ చేసింది. ఈ ఫండ్‌ను నిర్వహిస్తున్న నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. అదానీ పోర్ట్స్‌తో పాటు, నార్వేకు చెందిన నార్జెస్ బ్యాంక్ తన పోర్ట్‌ఫోలియో నుంచి అమెరికాకు చెందిన L3Harris టెక్నాలజీస్, చైనాకు చెందిన Weichai పవర్‌లను కూడా తొలగించాయి.

గత ఏడాది చివర్లో నార్వే కౌన్సిల్ ఆన్ ఎథిక్స్ చేసిన సిఫార్సులను అనుసరించి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదానీ పోర్ట్స్‌ను 2022 నుంచి నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ పర్యవేక్షిస్తోంది. తాజాగా ఫండ్ నుంచి కంపెనీని తొలగించటంతో పర్యవేక్షణ ముగిసింది. ఈ అదానీ కంపెనీకి యుద్ధం, సంఘర్షణ ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనతో సంబంధం ఉందని ఆరోపించింది.
వాస్తవానికి మయన్మార్‌లోని పోర్ట్ టెర్మినల్‌లో అదానీ పోర్ట్స్ ప్రమేయం కారణంగా నార్వే ప్రభుత్వం కంపెనీపై కన్ను వేసింది. కంపెనీ ఆ పోర్టు ప్రాజెక్టును గత ఏడాదిలోనే విక్రయించింది. అయితే కొనుగోలుదారు గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదని నార్వే కౌన్సిల్ ఆన్ ఎథిక్స్ పేర్కొంది. అదానీ పోర్ట్స్‌కు ఇప్పటికీ డివిజన్‌తో సంబంధాలు ఉన్నాయో లేదో నిర్ధారించడం అసాధ్యంగా ఉన్నట్లు పేర్కొంది. చాలా తీవ్రమైన ఉల్లంఘనలు జరిగాయని, ఇది ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.
అదానీ పోర్ట్స్ భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్. పైగా కంపెనీ ఎండ్-టు-ఎండ్ లాజిస్టిక్స్ ప్రొవైడర్. దీనికి తోడు ఇటీవల కంపెనీ రేటింగ్ ఏజెన్సీ నుంచి AAA రేటింగ్ పొందిన తొలి భారత ప్రైవేటు పోర్ట్ ఆపరేటర్ గుర్తింపును తెచ్చుకుని కొత్త చరిత్ర సృష్టించింది. అదానీ పోర్ట్స్ మెుత్తంగా 13 పోర్ట్స్ అండ్ టెర్మినల్స్ కలిగి ఉంది. ఇది దేశంలోని మెుత్తం పోర్ట్స్ సామర్థ్యంలో 24 శాతం కావటం గమనార్హం. ఈ వార్తలన నడుమ కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో సాయంత్రం 3.20 గంటల సమయానికి 0.49 శాతం పెరిగి రూ.1,344.65 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో రానున్న నాలుగేళ్లలో కంపెనీ ఆదాయం రూ.50,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తోంది.


Click it and Unblock the Notifications