UPI: జెట్ స్పీడ్ తో భారత్ లో డిజిటలైజేషన్.. నగదు రహిత లావాదేవీల వాటా చూస్తే షాక్
UPI: పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి సంక్షోభాల వల్ల పలు దేశాల పరిస్థితి హీనస్థితికి దిగజారిపోయింది. కానీ వీటి కారణంగా భారత్ లో మాత్రం డిజిటల్ చెల్లింపుల్లో భారీ మార్పులు జరిగాయని చెప్పుకోవచ్చు. రిలయన్స్ జియో మార్కెట్లోకి అడుగుపెట్టడంతో మొదలైన డిజిటల్ విప్లవం.. రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతూ విస్తరిస్తోంది.
వ్యాపార లావాదేవీల్లో డిజిటల్ విధానంలో చెల్లింపుల వాటా FY26 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని ఓ నివేదిక వెల్లడించింది. రానున్న మూడేళ్లలో 50 శాతం నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందని అంచనా వేస్తున్నట్లు బైన్ & కంపెనీ పేర్కొంది. అప్పటికి భారతదేశ గృహ వినియోగం 3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.

ఎగువ-మధ్యతరగతి మరియు అధిక ఆదాయ విభాగాల ప్రజలు డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా చేస్తున్నట్లు బైన్ & కంపెనీ నివేదించింది. వ్యక్తి-వ్యాపారి (P2M) విభాగంలోని UPI చెల్లింపులు సైతం దాదాపు 1 ట్రిలియన్ డాలర్లు దాటినట్లు పేర్కొంది. ప్రస్తుతం సాంకేతికత మరియు ఆర్థిక రంగం ఊపందుకోవడంతో.. భారతదేశం నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారనుంది. దాదాపు 350-400 మిలియన్ల డిజిటల్ వినియోగదారులతో వచ్చే మూడేళ్లలో సుమారు 50 శాతం నగదు రహిత విధాన్ని ఇండియా అవలంభించనున్నట్లు సమాచారం.
UPI 2.0, 123 లైట్, UPIపై క్రెడిట్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC)పై క్రెడిట్, ప్రభుత్వ ప్రోత్సాహకాలను పెంచాల్సి ఉంటుందని ఆ సంస్థ పార్టనర్ మరియు ఫైనాన్షియల్ లీడర్ సౌరభ్ ట్రెహాన్ తెలిపారు. ఇటీవల సంవత్సరాలలో 40-50 శాతం CAGRతో UPI విపరీతమైన వృద్ధిని సాధించింది. చెల్లింపు పద్ధతుల్లో దాని మెరుపు వేగం, ఛార్జీలు లేని లావాదేవీలు దాని సక్సెస్ కు కారణంగా చెప్పవచ్చు. వీటికి తోడు క్రెడిట్ కార్డ్ మరియు బై నౌ పే లేటర్ (BNPL) లావాదేవీలు సైతం మొత్తం వినియోగంలో దాదాపు 8 శాతం వాటాను ఆక్రమించాయి. వీటన్నిటినీ గమనిస్తే డిజిటలైజేషన్ వైపు భారత్ వేగాన్ని గమనించవచ్చు.


Click it and Unblock the Notifications