ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, వామ్మో.. అమెరికా ఆర్థిక వ్యవస్థను అంచనా వేయలేం!
కరోనా మహమ్మారి దెబ్బతో ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం ఉందో తెలుసుకోవడం అంటే చీకటి బావిలోకి ప్రవేశించడం వంటిదని, అలాంటి సందర్భాల్లో లోతు ఎంతుందో ఎవరికీ అంతుబట్టదని అమెరికన్ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు దెబ్బతిన్నదో కూడా ప్రస్తుతం అంచనా వేయలేని పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా అంచనా వేయడమంటే చీకట్లోకి బాణం విసిరినట్లే అని చెబుతుండటం గమనార్హం. తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి అంటున్నారు.

నిరుద్యోగ ప్రయోజనాలు కోల్పోనున్నారు
రేటింగ్ ఏజెన్సీ జేపీ మోర్గాన్ సీఈవో, ప్రముఖ ఆర్థిక నిపుణులు జామీ డైమన్ కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి నాలుగు నెలలకు పైగా విజృంభిస్తోందని, దీని వ్యాప్తి వలన కలిగిన నష్టాన్ని ఇప్పుడే పూర్తిగా అంచనా వేయలేదని, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు జేపీ మోర్గాన్‌ను తీసుకుంటే మొదటి అర్ధ సంవత్సరంలో లోన్ నష్టాల అంచనా నేపథ్యంలో 15.7 బిలియన్ డాలర్లు ఇన్ఫ్యూజ్ చేసినట్లు తెలిపారు. అలాగే, అమెరికాలో నిరుద్యోగం పెరిగిందని గుర్తు చేస్తున్నారు. జూలై చివరి నాటికి 25.6 మిలియన్ల మంది వరకు నిరుద్యోగ ప్రయోజనాలను కోల్పోనున్నారని, అలాగే, కాంగ్రెస్ హౌస్‌హోల్డ్స్‌కు వారానికి 600 డాలర్ల అదనపు పేమెంట్‌ను పొడిగిస్తుందా లేదా తెలియదంటున్నారు.

బ్యాంకుల్లో చెల్లింపులు వాయిదా
సాధారణంగా సంక్షోభం వల్ల నిరుద్యోగం పెరుగుతుందని, ఇంటి ధరలు తగ్గుతాయని, ఉద్దీపనల కారణంగా అప్పుడే ప్రభావం పూర్తిగా తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. దాదాపు సగం మంది క్రెడిట్ కార్డు, మోర్టగేజ్ బ్యాంకు కస్టమర్లు తమ చెల్లింపులు వాయిదా వేశారని, పరిస్థితి దారుణంగా ఉంటే చెల్లింపులు మరింతగా తగ్గవచ్చునని చెబుతున్నారు. కస్టమర్ల ఫెడరల్ బెనిఫిట్స్ ల్యాప్స్ అయితే చెల్లింపులు పూర్తిగా మానివేయవచ్చునన్నారు.

కేసులు మళ్లీ పెరిగితే..
అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయని ఈ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాలిఫోర్నియా సహా వివిధ రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకోవడానికి కరోనా అవకాశం ఇవ్వడం లేదని, అలాగే, వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఇతర నగరాలు వివిధ జాగ్రత్తలు తీసుకుంటున్నాయని చెబుతున్నారు. రుణ నష్టాలకు సంబంధించి బ్యాంకులకు ప్రొవిజన్స్ ఉండాలన్నారు. రానున్న కాలంలో వైరస్ మరింత విజృంభిస్తే, మరోసారి షట్ డౌన్ విధించే పరిస్థితులు వచ్చే అవకాశముందని, అప్పుడు నిరుద్యోగిత రేటు తిరిగి 23 శాతానికి చేరుకోవచ్చునని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications