మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..
No More Talks: మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు నాలుగో వారంలోకి ప్రవేశించడంతో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన దారులు పూర్తిగా మూసుకుపోవడమే కాకుండా.. కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేసుకుంటామనే బెదిరింపులు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తాజాగా విడుదల చేసిన వీడియో సందేశం టెహ్రాన్ - వాషింగ్టన్ మధ్య ఉన్న యుద్ధాన్ని స్పష్టం చేస్తోంది. అమెరికాతో చర్చలు శాశ్వతంగా ముగిసిపోయాయని ఆయన ప్రకటించారు. సైనిక చర్య చేపట్టబోమని గతంలో హామీలు ఇచ్చినప్పటికీ.. అమెరికా తన మాట తప్పిందని, ఇది తమకు ఎదురైన చేదు అనుభవం, ద్రోహం అని ఆయన వాపోయారు. చర్చల్లో గణనీయమైన పురోగతి ఉన్నప్పటికీ, అమెరికా ఉద్దేశపూర్వకంగానే దాడులకు సిద్ధమైందని, దీనివల్ల నమ్మకం పూర్తిగా కనుమరుగైందని అరాఘ్చి పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించడంపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. ఒకవేళ తమ దేశ మౌలిక సదుపాయాలను తాకితే.. గల్ఫ్ దేశాలకు తాగునీరు అందించే డీశాలినేషన్ ప్లాంట్లు, ఇంధన కేంద్రాలను తాము కోలుకోలేని విధంగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. విద్యుత్ ప్లాంట్లపై దాడులు పౌరుల జీవనాన్ని అతలాకుతలం చేస్తాయని.. ఇవి యుద్ధ నేరాల కిందకు వస్తాయని ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ రాయబారి అభిప్రాయపడ్డారు.
యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా అణు కేంద్రాల వరకు వ్యాపించింది. నతాంజ్‌లోని తమ ప్రధాన అణు సుసంపన్నతా కేంద్రంపై జరిగిన దాడికి ప్రతీకారంగా.. ఇజ్రాయెల్‌లోని నెగెవ్ ఎడారిలో ఉన్న అణు పరిశోధనా కేంద్రంపై ఇరాన్ క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ప్రాణనష్టం జరగకపోవడాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక అద్భుతంగా అభివర్ణించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) నివేదికల ప్రకారం.. ఇరాన్ తన యురేనియం నిల్వలను ఇస్ఫహాన్ వంటి పలు సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది.
ఈ సంఘర్షణ ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్‌లను దాటి లెబనాన్, కువైట్, బహ్రెయిన్, యూఏఈ వంటి దేశాలకు పాకింది. దక్షిణ లెబనాన్‌లోని వంతెనలను ఇజ్రాయెల్ ధ్వంసం చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు భూతల దండయాత్రకు నాందిగా పేర్కొన్నారు. హిజ్బుల్లా కూడా ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. క్షిపణి, డ్రోన్ ముప్పుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు తమ వాయు రక్షణ వ్యవస్థలను (Air Defense Systems) సిద్ధం చేశాయి.ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్‌లో 1,500 మందికి పైగా, ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో వేల సంఖ్యలో పౌరులు మరణించారు. లెబనాన్‌లో పది లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ఉభయ పక్షాలు సంయమనం పాటించకపోతే, ఇది సుదీర్ఘ ప్రాంతీయ యుద్ధంగా మారి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications