మైనింగ్‌కు ఫుల్ స్టాప్.. పంచదార్ల కొండలను ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రక, పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం పంచదార్ల కొండ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం 'నో మైనింగ్ జోన్' (మైనింగ్ నిషేధిత ప్రాంతం)గా ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాంతంలో ఉన్న ఆధ్యాత్మిక, సంస్కృతిక, పురావస్తు, భూగర్భ జల, పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించి, రాబోయే తరాలకు ఈ క్షేత్రాన్ని యథాతథంగా అందించేందుకు గనుల శాఖ ఈ కీలక అడుగు వేసింది.
ఈ నిర్ణయంలో భాగంగా, పంచదార్ల గ్రామంలోని సర్వే నంబర్ 1 పరిధిలో 2.153 హెక్టార్ల విస్తీర్ణంలో గతంలో మంజూరు చేసిన కంకర (గ్రావెల్) క్వారీ లీజును ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. ఈ ఏడాది మే నెలలో దాసమనేని విజయ్ కుమార్ నాయుడు పేరిట మంజూరైన ఈ లీజు.. వాస్తవానికి 2036 మే 14 వరకు చెల్లుబాటులో ఉండేలా కేటాయించారు. అయితే, పరిమితికి మించిన తవ్వకాలు, స్థానిక భక్తుల నిరసనలు, పర్యావరణ ప్రమాదాలను పరిగణనలోకి తీసుకుని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ లీజును రద్దు చేస్తూ కొండ పరిసరాల్లో ఇకపై ఎలాంటి మైనింగ్ అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేశారు.

ధరాపాలెంలోని పంచదార్ల ఆలయం ఎంతో ప్రాచీనమైన చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది. క్రీస్తుశకం 1899వ సంవత్సరంలో భారత పురావస్తు శాఖ (ASI) ఈ క్షేత్రంలో ఏకంగా 17 ప్రాచీన శాసనాలను నమోదు చేసింది. ఆ తర్వాత ఈ వివరాలన్నీ 'దక్షిణ భారత శాసనాలు, ఆరవ సంపుటం' (South Indian Inscriptions, Volume VI) లో ప్రచురితమయ్యాయి. ఈ శాసనాలు ఆనాటి తూర్పు చాళుక్యులు, స్థానిక పాలకులు, రాణులు, వారు సమర్పించిన మతపరమైన దానాలు, నిర్మాణ కార్యకలాపాల వివరాలను సమగ్రంగా వెల్లడిస్తాయి.
ఆలయ ప్రాంగణంలోని కొండల నుండి నిరంతరం ప్రవహించే ఐదు నీటి ధారల (ఫౌంటెన్ల) ఆధారంగా ఈ క్షేత్రానికి 'పంచధారలు' లేదా 'పంచదార్ల' అనే పేరు వచ్చింది. అక్కడ దొరికిన ఒక శాసనం ప్రకారం, ఒక రాజు ఆలయ అంతరాలమండపాన్ని నిర్మించగా.. అతని రాణి వీరమ 'వీరసాగరం' అనే పవిత్ర తటాకాన్ని నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. అలాగే పంచధార నది ఒడ్డున, ఆలయ దక్షిణ ప్రవేశ ద్వారం వద్ద శ్రీధర-రాజమరేంద్రమహాపాత్ర అనే పాలకుడు గంభీరమైన గోపురాన్ని నిర్మించినట్లు మరొక శాసనం ధృవీకరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రస్తుత మైనింగ్ విధానంలో చట్టవిరుద్ధ తవ్వకాలపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. గనుల తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినా, సహజ సిద్ధమైన నీటి వనరులకు లేదా ప్రాచీన దేవాలయాల నిర్మాణాలకు విఘాతం కలిగినా చర్యలు తప్పవని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రాచీన కట్టడాలను రక్షించుకోవడానికే మొదటి ప్రాధాన్యత అని, చట్టవిరుద్ధంగా మైనింగ్ నిర్వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని గనుల శాఖ తెలిపింది. పంచదర్ల ఉదంతం ద్వారా ఏపీ ప్రభుత్వం పర్యావరణ, సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడటంలో తన దృఢ సంకల్పాన్ని చాటుకుంది.


Click it and Unblock the Notifications
