హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..
హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు క్యూ కట్టారు. ఇరాన్ యుధ్దం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.అయితే ప్రజల్లో విపరీతంగా వ్యాపిస్తున్న ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇంధన నిల్వలు నిండుకున్నాయని వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, వినియోగదారులు అనవసరంగా ఆందోళన చెందాల్సిన పని లేదని అసోసియేషన్ భరోసా ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి కంపెనీల వద్ద రాష్ట్ర అవసరాలకు మించి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. సరఫరా గొలుసులో ఎలాంటి అంతరాయం లేదని వారు వివరించారు.

ప్రస్తుతం బంకుల వద్ద కనిపిస్తున్న విపరీతమైన రద్దీకి ప్రధాన కారణం ప్రజల్లో నెలకొన్న భయమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇంధనం దొరకదేమోననే ఆందోళనతో వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తడం, ప్రతి ఒక్కరూ తమ వాహనాల్లో 'ఫుల్ ట్యాంక్' చేయించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బంకుల్లో ఉన్న నిల్వలు సాధారణం కంటే చాలా వేగంగా ఖాళీ అవుతున్నాయి. ఒక బంకులో స్టాక్ అయిపోయిన తర్వాత, డిపోల నుండి మళ్ళీ ట్యాంకర్లు వచ్చి నింపడానికి కొంత సమయం పడుతుంది. ఈ స్వల్ప కాల వ్యవధిలో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తుండటంతో, ప్రజలు దానిని శాశ్వత కొరతగా భావించి మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఒక రకమైన కృత్రిమ రద్దీకి దారితీసిందని బంకుల యజమానులు వాపోతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి, అమీర్‌పేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్ వంటి ప్రధాన ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే పెట్రోల్ బంకులు వాహనదారులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలో నిలబడటంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరా ఆగిపోతుందనే వదంతులు వేగంగా వ్యాపించడమే ఈ గందరగోళానికి మూలకారణమని తెలుస్తోంది. బంకుల వద్ద సిబ్బంది ఎంతగా నచ్చజెప్పినా, ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలనే ఆత్రుతతో జనం గంటల తరబడి వేచి ఉంటున్నారు.
ఈ పరిస్థితిపై అటు ప్రభుత్వం, ఇటు పౌర సరఫరాల శాఖ అధికారులు కూడా స్పందించారు. నగరానికి, రాష్ట్రానికి అవసరమైనంత ఇంధనం నిల్వలు నిరంతరం అందుబాటులో ఉంటాయని, పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. అనవసరంగా బంకుల వద్ద క్యూ కట్టడం వల్ల నిజంగా అత్యవసర పనులు ఉన్నవారికి ఇబ్బందులు కలుగుతాయని వారు హెచ్చరించారు. ప్రజలు సంయమనం పాటించి, సాధారణంగా తమకు ఎంత అవసరమో అంత మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేస్తే, ఈ కృత్రిమ రద్దీ ఒకటి రెండు రోజుల్లోనే సర్దుమణిగి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications