అలా చేస్తే ఒప్పుకోం: టెస్లాకు నితిన్ గడ్కరీ, ఆ వాహనాలను వెనక్కి పిలవండి
అమెరికా ఎలక్ట్రిక్ కారు మేకర్ టెస్లా ఇంక్ భారత్‌కు రావొచ్చునని, అయితే తయారైన కార్లను చైనా నుండి దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చేది లేదని, భారత్‌లోనే తయారు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. చైనాలో కార్లు తయారు చేసి, భారత్‌లో విక్రయిస్తామంటే కుదరదన్నారు. చైనా నుండి మాత్రం కార్లను ఎట్టి పరిస్థితుల్లో దిగుమతి చేసుకోరాదన్నారు. ఎలక్ట్రానిక్ వెహికిల్స్‌కు భారత్ ఎంతో అనువైన మార్కెట్ అన్నారు. ఈ క్రమంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్‌లో ఉత్పత్తికి సిద్ధపడితే తమకు ఎలాంటి సమస్య లేదని, నిరభ్యంతరంగా టెస్లా భారత్‌కు రావొచ్చునని, తయారీని ప్రారంభించవచ్చునన్నారు.
భారత్ అతిపెద్ద మార్కెట్ అని, ఇక్కడి నుండి విదేశాలకు ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ను ఎగుమతి చేసుకోవచ్చునని, కానీ చైనాలో తయారుచేసి భారత్‌లో విక్రయించాలనుకోవడం మాత్రం సరైన ఆలోచన కాదని తేల్చి చెప్పారు. ముందు భారత్‌లో ఈవీలను తయారు చేయాలని, ఆ తర్వాత పన్ను రాయితీలను పరిశీలిస్తామని ఇప్పటికే టెస్లాకు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం విదేశాల్లో పూర్తిగా తయారై భారత్‌కు దిగుమతి అవుతున్న కార్ల పైన 60 నుండి 100 శాతం కస్టమ్స్ సుంకం ఉంది.

ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్స్ మంటల్లో చిక్కుకుపోవడం పైన కూడా గడ్కరీ స్పందించారు. లోపాలు ఉన్న వాహనాలను వెనక్కి పిలిపించి, సరి చేయాలన్నారు. ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి అధిక ఉష్ణోగ్రతలు బ్యాటరీలకు సమస్యగా పరిణమించాయని చెప్పారు. అయితే భద్రతకే తొలి ప్రాధాన్యం అన్నారు. కస్టమర్ల రక్షణకు కంపెనీలు పెద్ద పీట వేయాలన్నారు.


Click it and Unblock the Notifications