నిర్మలతో పనిచేయడం కష్టం, జైట్లీ మాస్టర్ మైండ్: మాజీ ఆర్థిక కార్యదర్శి సంచలనం
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆర్థిక శాఖ మాజీ సెక్రటరీ సుభాష్ గార్గ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన బదలీ కోసం పట్టుబట్టారని, ఆమెతో పని చేయడం చాలా కష్టమన్నారు. తన ముందస్తు రాజీనామాకు కారణం నిర్మలనే అన్నారు. తనను బదలీ చేసిన అరగంటలో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు.
అరుణ్ జైట్లీ ఒక మాస్టర్ మైండ్ అని, ఆయనతో కలిసి పని చేయడం వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనకు చాలా ఉన్నతమైనదన్నారు. ప్రజా విధాన సమస్యల నాడిని అవగతం చేసుకున్న వ్యక్తి జైట్లీ అన్నారు. విధానాల అమలు, శాఖ నిర్వహణ వంటి అంశాలను ఆయన కార్యదర్శులకు విడిచి పెట్టేవారన్నారు.

పని విషయంలో సత్సంబంధాల్లేవు
కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నుండి తనను బయటకు పంపించటంలో నిర్మల కీలకంగా వ్యవహరించారని సుభాష్ చంద్రగార్గ్ ఆరోపించారు. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన మూడు వారాల్లో ఆర్థిక శాఖ నుంచి అతనిని విద్యుత్ శాఖకు బదిలీ చేశారు. ఆ తర్వాత గత ఏడాది అక్టోబర్ 31వ తేదీన ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తాజాగా, తన బ్లాగ్‌లో గార్గ్ రాజీనామా అంశంపై స్పందించారు. జైట్లీ నుండి ఆర్థికశాఖ పగ్గాలు చేపట్టిన నిర్మల భిన్నమైన వ్యక్తిత్వం ఉన్నవారని, తనపై విశ్వాసం చూపించలేకపోయారని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య పనికి సంబంధించి సత్సంబంధాలు ఉండేవి కాదన్నారు. ఆర్బీఐ మిగులు నిధుల్ని ప్రభుత్వానికి ఇవ్వడం, బ్యాంకింగేతర సంస్థలకు ప్యాకేజీతో పాటు పలు ఆర్థిక అంశాలు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించటంలో తమ మధ్య భేదాభ్రిపాయాలు తలెత్తాయన్నారు.

కలిసి పని చేయడం కష్టం
నిర్మలతో కలిసి పని చేయడం కష్టంగా భావించానని, తన బదలీని ఆర్థికమంత్రి కోరకముందే తమ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయన్నారు. తన రాజీనామా వెనుక రెండు కారణాలు ఉన్నాయన్నారు. ఒకటి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ నుండి కేంద్రం పక్కకు వెళ్లిపోవ డం, రెండోది ఆర్థికమంత్రితో తన సంబంధాలు బాగా లేకపోవడం అన్నారు. ఆర్థిక శాఖలో కాకుండా మరో శాఖలో పని చేయాలని తాను భావించలేదన్నారు.భిన్నమైన వ్యక్తిత్వం, నైపుణ్యం, ఎకనమిక్ పాలసీలకు సంబంధించిన సరైన విధానం కలిగి ఉన్నారని, చెప్పిన గార్గ్.. ఆమెతో కలిసి పని చేయడం మాత్రం కష్టమన్నారు.

ఆర్థిక శాఖ
అధికారికంగా, వ్యక్తిగతంగా సంబంధాలు దెబ్బతిన్నాయని గార్గ్ తెలిపారు. దీంతో బాధ్యతలు స్వీకరించిన నెలలోనే తన బదిలీ కోసం ఆమె పట్టుబట్టారని, అందుకే బడ్జెట్ సమర్పించిన తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జూలై 24న విద్యుత్ మంత్రిత్వ శాఖకు బదిలీ ఉత్తర్వు జారీ అయిన అరగంటలోనే స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దాఖలు చేశానన్నారు. ఆ తర్వాత ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయానన్నారు. కాగా, ఈ అంశంపై ఆర్థిక శాఖ, నిర్మలా సీతారామన్ స్పందించేందుకు నిరాకరించాయి.


Click it and Unblock the Notifications