చిన్న కంపెనీలకు కేంద్రం కొత్త స్కీం, వారికి పీఎఫ్ ప్రభుత్వమే చెల్లిస్తుంది
సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థలు(MSME) భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటివి అని, తమ ప్రభుత్వం ఈ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శనివారం లక్నోలో MSMEల కోసం ఉభర్‌తే సితారే నిధిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా భారత్ అవతరించడానికి ఈ ఫండ్ ఉపకరిస్తుందన్నారు. ఎగ్జిమ్ బ్యాంక్, సిడ్బీ కలిసి ఈ నిధిని ఏర్పాటు చేశాయి. టెక్నాలజీ, ప్రోడక్ట్స్, ఎగుమతుల పరంగా వృద్ధి చెందేందుకు అవకాశాలు ఉండి సరైన ప్రదర్శనను కనబరచలేకపోతున్న MSMEలను గుర్తించడమే ఈ నిధి ఏర్పాటు ఉద్దేశం. గత రెండేళ్లలో, ముఖ్యంగా కరోనా సమయంలో MSME రంగానికి సంబంధించి అనేక చర్యలను చేపట్టినట్లు నిర్మలమ్మ తెలిపారు. MSMEల నిర్వచనాన్ని ప్రభుత్వం మార్చిందని, దానిని సులభతరం చేసిందన్నారు. MSMEలకు నేరుగా ప్రయోజనం కలగజేసే ఓ బిల్లును పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
కరోనా సంక్షోభం సమయంలో కోల్పోయిన ఉద్యోగంలో తిరిగి చేరిన ఉద్యోగుల మొత్తం పీఎఫ్ చందాను వచ్చే ఏడాది వరకు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని నిర్మలా సీతారామన్ వేరుగా ప్రకటించారు. అంతేకాదు, ఏ జిల్లాలో అయినా 25వేలకు పైగా అసంఘటితరంగ కార్మికులు తమ స్వస్థలానికి తిరిగి వెళ్లారని, వారికి ఉపాధికి సంబంధించిన 16 ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లభిస్తాయన్నారు. గత ఏడాది నవంబర్ నెలలో కేంద్రం ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా, 2020 మార్చి 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ మధ్య ఉద్యోగం కోల్పోయిన వారికి లేదా 2020 అక్టోబర్ 1వ తేదీ నాటికి ఈపీఎఫ్ అకౌంట్ లేని వారికి ఉద్యోగం కల్పించే EPFO రిజిస్టర్డ్ కంపెనీలకు ప్రభుత్వం రెండేళ్ల పీఎఫ్ సబ్సిడీని కల్పించింది.

అక్టోబర్ 1వ తేదీ నుండి ఈ కంపెనీలు కొత్తగా ఉద్యోగంలోకి చేర్చుకున్న ఉద్యోగుల పీఎఫ్ చందాను రెండు సంవత్సరాల వరకు కేంద్రం చెల్లిస్తుంది. అంటే వీరి వేతనం రూ.15,000లోపు ఉండాలి. వెయ్యి మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కొత్తగా చేర్చుకునే ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సిన పీఎఫ్ చందా మొత్తాన్ని కేంద్రం భరిస్తుంది. ఇందులో ఉద్యోగి వాటా 12 శాతం, యాజమాన్య వాటా 12 శాతం ఉంది. వెయ్యికి పైగా ఉద్యోగులు ఉన్న కంపెనీల పీఎఫ్ ఖాతాల్లో ఉద్యోగి వాటాను కేంద్రం చెల్లిస్తుంది.


Click it and Unblock the Notifications