Kisan Rin Portal: రైతుల కోసం కొత్త పోర్టల్.. ఇన్ని ప్రయోజనాలా.. వాడేసుకోండి..
Kisan Rin Portal: దేశంలో రైతుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. చాలా మంది తమ పిల్లలను వ్యవసాయం వైపు ప్రోత్సహించటం లేదు. సాగులో ఉండే నష్టాల కంటే వ్యాపారమో, ఉద్యోగమో చేసుకోవటం మేలంటున్నారు. అందుకే ప్రభుత్వాలు ఇప్పుడు అన్నదాతపై దృష్టి పెట్టాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కిసాన్ లోన్ పోర్టల్(KRP)ను ప్రారంభించారు. ఈ పోర్టల్ అనేక ప్రభుత్వ శాఖల సహకారంతో అభివృద్ధి చేయబడింది. కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) కింద క్రెడిట్ సేవలు పొందేందుకు వెసులుబాటును అందిస్తుంది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ రైతుల డేటా, రుణ పంపిణీ సమాచారం, వడ్డీ రాయితీతో పాటు స్కీమ్ పురోగతి గురించి సమాచారాన్ని అందిస్తుంది.

KCC లోన్ ఖాతాదారులకు సంబంధించిన సమాచారం ఇప్పుడు కిసాన్ లోన్ పోర్టల్‌లో సమగ్ర రూపంలో సులభంగా అందుబాటులో ఉంటుంది. గతంలో ఈ సౌకర్యం లేదు. ఇది ఆధార్ ద్వారా పనిచేస్తుంది. ఈ పోర్టల్ ద్వారా నేరుగా లబ్ధిదారునికి వడ్డీ రాయితీ క్లెయిమ్‌ల చెల్లింపును అందించే ప్రణాళిక ఉంది. పోర్టల్ ప్రభుత్వానికి లబ్ధిదారులు, డిఫాల్ట్ అయిన రైతుల వివరాలను అందిస్తుంది. దేశంలోని ప్రతి ఇంట్లో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను చేరువ చేసేందుకు "ఘర్ ఘర్ కెసిసి క్యాంపెయిన్" ప్రారంభించారు. దీని కింద 1.5 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాలని కేంద్రం నిర్ణయించింది.
దేశంలోని ప్రతి రైతుకు నిరంతరాయంగా రుణ సదుపాయాలు అందేలా చూడటం.. తద్వారా వారి వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా నడిచేలా చేయటమే దీని ప్రధాన లక్ష్యంగా ఉంది. మార్చి వరకు సుమారు 7.35 కోట్ల KCC ఖాతాలు ఉన్నాయి. వీటికి మెుత్తం రూ.8.85 లక్షల కోట్లు రుణం రూపంలో విడుదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇదే సమయంలో వెదర్ ఇన్ఫర్మేషన్ నెట్‌వర్క్ డేటా సిస్టమ్ (WINDS)ని కూడా ప్రారంభించింది. దీని ద్వారా రియల్ టైమ్ లో వాతావరణ వివరాలను రైతులు పొందేందుకు వీలు ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. తద్వారా రైతులు తమ పంటలకు సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవచ్చు.


Click it and Unblock the Notifications