కనీస వేతనం పెంపు, కార్మికులందరికీ కనీస వేతన హక్కు: నిర్మల
రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో భాగంగా నిన్న రూ.6 లక్షల కోట్లు ప్రకటించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు (మే 14) రెండో ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీలో వ్యవసాయ రంగం, వలస కార్మికులు, వీధి వ్యాపారస్తులు, చిరు, సన్నకారు రైతులకు ఊరట కల్పించారు. వీరికి 9 పాయింట్ల ఫార్ములాతో ముందుకు వచ్చారు. కార్మికులకు కనీస వేతనాన్ని పెంచుతున్నట్లు చెప్పారు. చిన్న, సన్నకారు రైతులకు ఇప్పటికే రూ.4 లక్షల కోట్లు ఇచ్చామన్నారు. ఇప్పటికే మార్చి, ఏప్రిల్ నెలల్లో 25 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేశామన్నారు.
3 కోట్ల మంది రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చామని చెబుతూ, వలస కార్మికులను కేంద్రం విస్మరించలేదన్నారు. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు మే 31వ తేదీ వరకు వడ్డీ రాయితీ పొడిగింపు ఇస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల కోసం రాష్ట్రాలకు రూ.6,700 కోట్లు ఇచ్చామన్నారు. మార్చి - ఏప్రిల్‌లో రూ.86,600 కోట్లకు పైగా వ్యవసాయ రుణాలు, గ్రామీణ మౌలిక వసతుల కోసం రూ.4,200 కోట్లు, వలస కార్మికుల పునరావాసం, ఆహారం కోసం రూ.11,000 కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రాలు విపత్తు నిధులను వలస కూలీలకు ఉపయోగించాలని సూచించారు.

కరోనా సమయంలో నాబార్డు ద్వారా రూ.29,500 కోట్ల మొత్తాన్ని రూరల్ బ్యాంకులు తీసుకున్నట్లు చెప్పారు. గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం ఇవి ఇచ్చినట్లు తెలిపారు. నగరాల్లో ఇళ్లు లేని పేదలకు 3 పూటలా భోజనం పెడుతున్నట్లు చెప్పారు. గత రెండు నెలల నుంచి నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. 12,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ సమయంలో కోట్లాది మాస్కులు, శానిటైజర్లు తయారు చేసినట్లు చెప్పారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 1.20 లక్షల లీటర్ల శానిటైజర్ల ఉత్పత్తి జరిగిందన్నారు.
కార్మికుల కోసం దేశమంతా ఒకే వేతనం అమలు చేస్తున్నట్లు నిర్మల తెలిపారు. కనీస వేతన హక్కుగా వేతనాన్ని రూ.180 నుండి రూ.202కు పెంచుతున్నట్లు తెలిపారు. వలస కార్మికుల ఉపాధికి రూ.10వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ రానున్న రెండు నెలల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
వలస కార్మికుల కోసం మరో రెండు నెలల పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నట్లు తెలిపారు. వలస కార్మికులకు రేషన్ అందేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలని చెప్పారు. రేషన్ కార్డు లేని వారికి కూడా 5 కిలోల బియ్యం, 5 కిలోల గోదుమలు, కిలో శనగలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీని వల్ల దాదాపు కోట్లాది మంది వలస కార్మికులకు ప్రయోజనం.


Click it and Unblock the Notifications