ఫార్మా రంగంలో దూసుకెళ్లనున్న వాషింగ్ పౌడర్ బ్రాండ్.. 'గ్లెన్ మార్క్'లో 75 శాతం వాటా కొనుగోలు
Market News: 'వాషింగ్ పౌడర్ నిర్మా..' అంటూ టీవీల్లో గతంలో యాడ్ ఊదరగొట్టేది. కానీ క్రమేపీ అదికాస్తా కనుమరుగయ్యింది. చాలాకాలం తర్వాత మరోసారి నిర్మా వార్తల్లోకి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజంలో మెజారిటీ వాటాను దక్కించుకుని మార్కెట్ వర్గాలకు షాక్ ఇచ్చింది.
రుణభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్లెన్ మార్క్ కీలక నిర్ణయం తీసుకుంది. తన ఫార్మా విభాగం గ్లెన్ మార్క్ లైప్ సైన్సెస్ లో 75 శాతం వాటాను నిర్మాకు విక్రయించింది. ఈ డీల్ విలువ 5 వేల 651 కోట్లు కాగా.. డాక్టర్ కర్సన్ భాయ్ పటేల్ స్థాపించిన నిర్మా గ్రూపు దీని ద్వారా API విభాగంలోకి ప్రవేశించింది. ఈ మొత్తాన్ని తన రుణాల తిరిగి చెల్లింపునకు గ్లెన్ మార్క్ ఉపయోగించనుంది.

ఈ డీల్ తరువాత గ్లెన్ మార్క్ లైఫ్ సైన్సెస్ లో తన మాతృసంస్థ గ్లెన్ మార్క్ ఫార్మా 7.84 శాతం వాటా కలిగి ఉంటుంది. దాదాపు 7 వేల 500 కోట్ల ఎంటర్ ప్రైజ్ విలువతో ఒప్పందం కుదరగా.. సెబీ నిబంధనల ప్రకారం పబ్లిక్ షేర్ హోల్డర్స్ కు త్వరలోనే ఓపెన్ ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఫార్మా రంగంలో మరింత ముందుకు సాగేందుకు ఈ డీల్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్మా భావిస్తోంది.
'గ్లెన్ మార్క్ ను మరింత వృద్ధి పథంలో నడిపించడానికి నిర్మాతో కుదుర్చుకున్న ఈ వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంతోషిస్తున్నాము. సైన్సెస్, డెర్మటాలజీ, రెస్పిరేటరీ, ఆంకాలజీ వంటి ప్రధాన చికిత్సా రంగాలపై నిరంతరం దృష్టి పెడుతూ.. లీడ్ ఆర్గనైజేషన్ గా ఎదిగేందుకు ఈ ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం' అని గ్లెన్ మార్క్ ఫార్మా ఛైర్మన్, MD గ్లెన్ సల్దాన్షా అధికారికంగా ప్రకటించారు.


Click it and Unblock the Notifications