Nirav Modi: విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి పలువురు భారత బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వారు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. విజయ్ మాల్యా అయితే రుణాలన్నిటినీ తిరిగి చెల్లిస్తానని స్వయంగా తనే ప్రకటించాల్సి వచ్చింది. ఇక నీరవ్ మోడీ విషయానికొస్తే.. కోర్టు ఖర్చులకు సైతం అకౌంట్లో నిధులు లేని దయనీయ పరిస్థితి దాపురించింది.
డైమండ్ వ్యాపారిగా మంచి పేరు సంపాదించిన నీరవ్ మోడీ, ఒకప్పటి బిలియనీర్. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అదే బ్యాంకుకు టోపి పెట్టి తీసుకున్న వేలాది కోట్ల రుణాలు చెల్లించకుండా విదేశాలకు పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019లో లండన్ పోలీసులు ఆయన అరెస్టు చేసిన నాటి నుంచి పరిస్థితి మరింత దిగజారింది. ప్రస్తుతం ఆయన కంపెనీ అకౌంట్లలో కనీసం వెయ్యి రూపాయలు కూడా లేని స్థితికి దిగజారి పోయారు.

నీరవ్ మోడీకి చెందిన ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు అకౌంట్లో రూ.236 బ్యాలెన్స్ ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఆదాయపు పన్నుకు సంబంధించిన బకాయిలకుగాను.. రూ.2.46 కోట్లను కోటక్ మహీంద్రా బ్యాంకు SBIకి ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం అకౌంట్ లో వెయ్యి రూపాయలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు సైతం మొత్తం బకాయిల్లో కొంత మొత్తాన్ని ఆదాయపుపన్ను కింద ఇప్పటికే ట్రాన్స్ఫర్ చేసినట్లు నివేదిక పేర్కొంది.
కోర్టు ఖర్చులు చెల్లించడం కోసం అప్పులు చేయనున్నట్లు న్యాయస్థానానికి నీరవ్ మోడీ ఇటీవల వెల్లడించారు. భారత్ లోని తన ఆస్తులను సీజ్ చేయడంతో మరో దారి లేదని స్పష్టం చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో మోసానికి పాల్పడటం, అందుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుతో పాటు CBI విచారణకు సంబంధించిన ఆధారాలను మరియు సాక్ష్యులను ప్రభావితం చేయడం వంటి 3 కేసులు ఇండియాలో ఆయన మీద నమోదై ఉన్నాయి.


Click it and Unblock the Notifications