Nifty New Highs: నిన్న గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా నడిచిన దేశీయ సూచీలు భారీ ఒడిదొడుకులతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే నేడు దలాల్ స్ట్రీట్ లో బుల్స్ దౌడు తిరిగి ప్రారంభమైంది. బ్యాంకింగ్, మిడ్ క్యాప్ సూచీలు కొంత నష్టాల్లో ఉన్నప్పటికీ కీలక సూచీలు మాత్రం లాభాల పంట పండిస్తున్నాయి.
ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ తన సరికొత్త జీవితకాల గరిష్ఠమైన 24,401.20 పాయింట్ల మార్కును అందుకుంది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 11.55 గంటల సమయానికి 300 పాయింట్లకు పైగా లాభంతో 80261 మార్క్ వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. మరో రెండు వారాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత మెుదటి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ఇప్పటికే దేశంలోని వివిధ వర్గాలు కోటి ఆశలతో ఉన్నాయి. ఆ సానుకూల ధోరణి దేశీయ స్టాక్ మార్కెట్లలో సైతం కొనసాగుతోంది.

నేడు ఇంట్రాడేలో ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ స్టాక్స్, ఆటో రంగానికి చెందిన షేర్ల పెరుగుదల మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలను లాభాల బాటలో కొనసాగేందుకు దోహదపడ్డాయి. ఇదే క్రమంలో ఇంట్రాడేలో రైల్ వికాస్ నిగమ్, IRFC, HDFC బ్యాంక్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, భారత్ ఎలక్ట్రికల్స్ స్టాక్స్ ఎన్ఎస్ఈలో అత్యంత యాక్టివ్ షేర్లలో కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో దేశంలోని అనేక లిస్టెడ్ కార్పొరేట్ సంస్థలు తమ జూన్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించటం కొన్ని నిర్థిష్ట కంపెనీల షేర్లలో లాభాలను ప్రేరేపిస్తోంది. ఇదే క్రమంలో భారతదేశం బియ్యం ఎగుమతి పరిమితులను సడలించడంతో ఆ రంగంలో వ్యాపారం చేస్తున్న కంపెనీల షేర్లు దాదాపు 15 శాతం ర్యాలీ చేశాయి. బియ్యం సంబంధిత స్టాక్స్ ఎల్‌టి ఫుడ్స్, కెఆర్‌బిఎల్, GRM ఓవర్సీస్, కోహినూర్ ఫుడ్స్ కంపెనీల షేర్లు భారత ప్రభుత్వ నిర్ణయంతో నేడు లాభపడ్డాయి. అలాగే కొనసాగుతున్న ఖరీఫ్ సీజన్ ముగిసిన తర్వాత, తుది ఉత్పత్తి గణాంకాలు అందుబాటులోకి వచ్చాక సెప్టెంబర్‌లో కొన్ని రకాల బియ్యం ఎగుమతులపై విధించిన పరిమితులను కేంద్రం సమీక్షించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications