18,000 పాయింట్లకు చేరువలో నిఫ్టీ, సెన్సెక్స్ 148 పాయింట్లు జంప్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో ఉదయం ఊగిసలాటలో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం గం.2.30 తర్వాత లాభాల్లోకి వచ్చాయి. చివరకు దాదాపు 150 పాయింట్ల లాభాల్లో ముగిసింది సెన్సెక్స్. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా ప్రారంభమయ్యాయి. దేశీయంగా విద్యుత్ సంక్షోభం ఆందోళన నేపథ్యంలో సూచీలు మొదట్లో అప్రమత్తంగా కదిలాయి. అయితే, కరెంట్ కోతలకు ఆస్కారం లేదని కేంద్రం స్పష్టం చేయడం, సమస్య పరిష్కారానికి రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిన నేఫథ్యంలో సూచీలు కాస్త లాభాల్లోకి వచ్చాయి. విద్యుత్ సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచి, చివరి గంటలో కొనుగోళ్ళకు మొగ్గు చూపేలా చేసింది. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 16 పైసలు క్షీణించి 75.52 వద్ద ముగిసింది.

నష్టాల నుండి లాభాల్లోకి..
సెన్సెక్స్ ఉదయం 60,045.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,331.74 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,885.39 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,915.80 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,008.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,864.95 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 148.53 (0.25%) పాయింట్లు లాభపడి 60,284.31 పాయింట్ల వద్ద, నిప్టీ 46.00 (0.26%) పాయింట్లు ఎగిసి 17,991.95 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 52 వారాల గరిష్టం 60,412.32 కాగా, 52 వారాల కనిష్టం 39,241.87. నిఫ్టీ 52 వారాల గరిష్టం 18,041.95, 52 వారాల కనిష్టం 11,535.45. ఆటో, మెటల్, పీఎస్‌యూ బ్యాంకు స్టాక్స్ అదరగొట్టాయి.

'పవర్' ప్రాబ్లమ్
బొగ్గు ధరలు పెరగడం, కొరత కారణంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అంధకారంలోకి వెళ్తాయని వార్తలు ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల పైన తీవ్ర ప్రభావం చూపింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటన ఊరటనిచ్చింది. ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలపడి చివరలో మార్కెట్లు పుంజుకున్నాయి. అంతేకాదు, కేంద్ర కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి కూడా దీనిపై ప్రకటన చేశారు. భారత్‌లో మరో 22 రోజులకు సరిపడా బొగ్గు పవర్ ప్లాంట్స్ వద్ద ఉందని తెలిపారు. ఇది కూడా ఇన్వెస్టర్లకు ఊరటను కల్పించింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ 5.51 శాతం, బజాజ్ ఆటో 3.29 శాతం, SBI 2.93 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.87 శాతం, హిండాల్కో 2.29 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో HCL టెక్ 4.03 శాతం, HDFC లైఫ్ 1.94 శాతం, టెక్ మహీంద్రా 1.84 శాతం, కోల్ ఇండియా 1.80 శాతం, శ్రీ సిమెంట్స్ 1.13 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications