దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు: నేటి HUL, రిలయన్స్ క్యూ4 ఫలితాలు ఎలా ఉండొచ్చు
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. గత మూడు రోజుల నుండి లాభాలను నమోదు చేస్తోన్న దలాల్ స్ట్రీట్ గురువారం (ఏప్రిల్ 30) కూడా అదే ఒరవడిని కొనసాగించాయి. సెన్సెక్స్ 652.09 పాయింట్లు లేదా 1.99% లాభపడి 33,372.25 వద్ద, నిఫ్టీ 185.60 పాయింట్లు లేదా 1.94% ఎగిసి 9,738.95 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 647 షేర్లు లాభాల్లో, 121 షేర్లు నష్టాల్లో ఉండగా 34 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. చాలా సెషన్స్ తర్వాత సెన్సెక్స్ 33వేల మార్క్ దాటి 34వేల దిశగా వెళ్తోంది. నిఫ్టీ 10,000కు సమీపంలో ఉంది. గం.10 సమయానికి సెన్సెక్స్ దాదాపు 1,000 పాయింట్లు ఎగిసింది.
టాప్ లూజర్స్ జాబితాలో సన్ ఫార్మా, హిందూస్తాన్ యూనీ లీవర్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్, వేదాంత, హీరో మోటా కార్ప్, టాటా స్టీల్, హిండాల్కో ఉన్నాయి. నిఫ్టీ ఆటో 5 శాతం లాభాల్లో ఉంది. గ్లేన్‌మార్క్ 9 శాతం ఎగిసింది.

కాగా, ఈ రోజు హిందూస్థాన్ యూనీ లీవర్ క్వార్టర్ 4 ఫలితాలను వెల్లడించనుంది. లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యావసరాలకు డిమాండ్ పెరిగిందని, అయితే కొన్నిచోట్ల డెలివరీ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వినియోగం పెరిగిందని, ఫలితాలు మెరుగ్గానే ఉండే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా క్వార్టర్ 4 ఫలితాలను విడుదల చేయనుంది. నిత్యవసరాలకు డిమాండ్ పెరిగినప్పటికీ రిలయన్స్ మేజర్ వాటా చమురు పైన ఉన్న నేపథ్యంలో కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ పైన ప్రభావం చూపవచ్చునని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications