మరో ప్యాకేజీ, లాభాల్లో ముగిసిన మార్కెట్లు: రూపాయి మరింత పతనం
ముంబై: స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం ఏప్రిల్ 16) నష్టాలతో ప్రారంభమై, లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 222.80 పాయింట్లు (0.73%) లాభపడి 30,602.61 వద్ద, నిఫ్టీ 67.50 పాయింట్లు (0.76%) ఎగిసి 8,992.80 వద్ద క్లోజ్ అయింది. 1596 షేర్లు లాభాల్లో, 743 షేర్లు నష్టాల్లో ముగియగా, 148 షేర్లలో మార్పు లేదు. NTPC, వేదాంత, ICICI బ్యాంకు, హిండాల్కో, టైటాన్ భారీగా లాభపడ్డవాటిలో ఉన్నాయి. HCL టెక్, కొటక్ మహీంద్రా బ్యాంకు, టెక్ మహీంద్రా, హీరో మోటో కాప్ప్, ఇన్ఫోసిస్ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఉదయం సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 81 పాయింట్ల నష్టంతో ప్రారంభమై సాయంత్రానికి లాభపడ్డాయి.

ఐటీ, ఎఫ్ఎంసీజీ నష్టాల్లో..
నేడు సెన్సెక్స్ ఓ సమయంలో 784 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 222 పాయింట్ల లాభంతో ముగిసింది. ఐటీ, ఎఫ్ఎంసీజీ మినహా మిగతా రంగాల షేర్లు లాభాలను చూశాయి. మీడియా, బ్యాంకింగ్ స్టాక్స్ లాభాలను చవిచూశాయి. మార్కెట్లు గత వారం లాభాల్లో ముగిశాయి. ఈ వారంలో తొలుత నష్టాలు చూశాయి. ఈ రోజు తిరిగి లాభాల్లోకి వచ్చాయి.

కేంద్రం ప్యాకేజీ
మార్కెట్లు లాభాల్లోకి రావడానికి ప్రధాన కారణంగా కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తుందనే వార్తలు మార్కెట్ సెంటిమెంటును బలపరిచాయి. కేంద్రం పేదలకు రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కంపెనీలకు, సంస్థలకు మరో ప్యాకేజీకి సిద్ధమవుతుందనే వార్తలు వెలువడుతున్నాయి.

కరోనా కేసులు తగ్గడం...
ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో కరోనా మృతులు, కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. అమెరికాలోను గత పది రోజుల్లో కంటే నిన్న మృతుల సంఖ్య తగ్గింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు కాస్త కోలుకుంటున్నాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది.

రూపాయి మరింత బలహీనం
డాలర్ మారకంతో రూపాయి మరింత బలహీనపడింది. ఈ రోజు రూపాయి 43 పైసలు క్షీణించి 76.87కు చేరుకుంది. ఈ సెషన్‌లో రూపాయి 76.68 నుండి 76.87 మధ్య కదలాడింది. అంతకుముందు సెషన్‌లో (బుధవారం) 76.44 వద్ద ముగిసింది


Click it and Unblock the Notifications