దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (శుక్రవారం, జూన్ 17) నష్టాల్లో ముగిశాయి. ఉదయం భారీ నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత 51,000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ నష్టాలను మాత్రం తప్పించుకోలేకపోయాయి. సూచీలు రోజంతా నష్టాల్లోనే కొనసాగాయి. మధ్యాహ్నం చివరి అరగంట సమయంలో కాస్త లాభాల్లోకి వచ్చినప్పటికీ కాసేపు మాత్రమే. తిరిగి నష్టాల్లోకి జారుకున్నది. అయితే ఆరంభంలోని భారీ నష్టాల నుండి మాత్రం కాస్త ఊరట దక్కింది.
సెన్సెక్స్ ఉదయం 51,181 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,652 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,921 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 135 పాయింట్లు నష్టపోయి 51,360 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు దాదాపు 700 పాయింట్ల మేర పైకి కిందకు కదలాడింది. నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయి 15,293 పాయింట్ల వద్ద ముగిసింది.

ఫెడ్ బుధవారం హఠాత్తుగా వడ్డీ రేటును 0.75 శాతం పెంచింది. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే మున్ముందు మరిన్నిసార్లు వడ్డీ రేటు పెంపు ఉంటుందనే సంకేతాలు ఇచ్చింది. ఇది మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. ఇది ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుకుల్లో కొనసాగుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేటు అనంతరం కుప్పకూలాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది.


Click it and Unblock the Notifications