నష్టాల్లో ముగిసిన మార్కెట్లు: 12,000 దిగువకు నిఫ్టీ, 127 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. అర్జెంటీనా, బ్రెజిల్‌పై అదనపు టారిఫ్ విధించేందుకు అమెరికా నిర్ణయించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై పడింది. అంతర్జాతీయ పరిణామాలతో పాటు లోహ, బ్యాంకింగ్ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు మరింత ఒత్తిడిలోకి నెట్టాయి. దీంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
మంగళవారం (నవంబర్ 3) నాటి సెషన్లో సెన్సెక్స్ 127 పాయింట్లు నష్టపోయి 40,675 వద్ద, నిఫ్టీ 54 పాయింట్లు కోల్పోయి 11,994 పాయింట్ల వద్ద ముగిసింది. ఇటీవల సెన్సెక్స్, నిఫ్టీ రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు నిఫ్టీ 12,000 మార్క్ దిగువకు వచ్చింది. సెన్సెక్స్ 40,000కు కాస్త పైన మాత్రమే ముగిసింది.

ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లు రెండు శాతానికి పైగా నష్టపోయాయి. యస్ బ్యాంకు, టాటా స్టీల్స్, టాటా మోటార్స్, వేదాంత తదితర షేర్లు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ఉదయం నుంచి మందకోడిగానే ఉన్నాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి టాప్ గెయినర్స్‌లో బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, టీసీఎస్, కొటక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఉన్నాయి. యస్ బ్యాంకు, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా స్టీల్స్, జీ ఎంటర్టైన్మెంట్, అదానీ పోర్ట్స్ నష్టాల్లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications