ఆర్బీఐ ఎఫెక్ట్, మార్కెట్లకు జోష్: ఫ్లాట్‌గా ముగిసిన రూపాయి
ముంబై: నేడు ఉదయం (ఆగస్ట్ 6) లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ప్రకటన అదే ఉత్సాహం కొనసాగడానికి కారణమయ్యాయి. ఆర్బీఐ రెపో రేటును యథాతథంగా 4 శాతం వద్దే ఉంచింది. దీంతో మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేపట్టారు. దీంతో సెన్సెక్స్ 362 పాయింట్ల లాభంతో 38,025 వద్ద ముగిసింది. నిఫ్టీ 98.50 పాయింట్లు ఎగిసి 11,200.20 వద్ద క్లోజ్ అయింది.
ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, గెయిల్, హెచ్‌సీఎల్ టెక్, యూపీఎల్ టాప్ గెయినర్స్‌గా, శ్రీ సిమెంట్స్, ఐచర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్ టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. ఐటీ, మెటల్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు 1 శాతం, అంతకంటే ఎక్కువ లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.7 శాతం, స్మాల్ క్యాప్ ఒక శాతం లాభాలు చూశాయి.

డాలర్ మారకంతో రూపాయి ఈ రోజు ఫ్లాట్‌గా ముగిసింది. ఓ సమయంలో 17 పైసలు ఎగబాకి 74.77 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం 74.82 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత మరో ఐదు పైసలు పుంజుకుంది. కానీ చివరకు 74.94 వద్ద ముగిసింది. 74.77 నుండి 74.96 మధ్య ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications