నష్టాల్లో నుండి భారీ లాభాల్లోకి మార్కెట్లు, రిలయన్స్ 13% రిటర్న్స్
స్టాక్ మార్కెట్లు నేడు స్థిరంగా ప్రారంభమై, ఆ తర్వాత నష్టాల్లోకి జారుకొని, మధ్యాహ్నం తర్వాత లాభాల్లోకి వచ్చాయి. మధ్యాహ్నం తర్వాత సూచీలు అనూహ్యంగా పుంజుకున్నాయి. ఆసియా - పసిఫిక్ మార్కెట్లు లాభాల్లో ముగియడం దేశీయ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఐరోపా మార్కెట్లు కూడా ఈ రోజు సానుకూలంగా కదలాడుతున్నాయి. చమురు ధరల పెరుగుదల, అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాల మధ్య ఉదయం సూచీలు నష్టాల్లో కనిపించాయి. కానీ ఆటో, బ్యాంకింగ్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఆ తర్వాత మార్కెట్ పరుగుకు కారణమయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 57,297 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,052 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,930 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,120 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,334 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,006 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 697 పాయింట్లు ఎగిసి 57,989 పాయింట్ల వద్ద, నిఫ్టీ 198 పాయింట్లు లాభపడి 17,315 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఈ రోజు 1100 పాయింట్ల మేర పైకి, కిందకు కదలాడింది. ఓ సమయంలో 58,000 పాయింట్లను క్రాస్ చేసినప్పటికీ, ఆ సమీపంలో ముగిసింది.

సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో ఐదు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్, నెస్లే ఇండియా, ఎన్టీపీసీ, సన్ ఫార్మా, ఏషియన్ పేయింట్స్ మాత్రమే నష్టపోగా, టెక్ మహీంద్రా, రిలయన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐటీసీ, టీసీఎస్, కొటక్ మహీంద్రా బ్యాంకు, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, విప్రో షేర్లు భారీగా లాభపడ్డాయి.
రష్యా - ఉక్రెయిన్ మధ్య గత కొద్ది రోజులుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. కానీ రష్యా కాల్పుల విరమణకు అంగీకరిస్తే ఉక్రెయిన్ నాటో సభ్యత్వానికి పట్టుబట్టబోదన్న హామీ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జెలెన్‌స్కీ చెప్పారు. ఇది సానుకూల అంశం. మరోవైపు, ద్రవ్యోల్భణం, అధిక నిరుద్యోగంతో ఇబ్బందు పడుతూ, మందగమనానికి గురయ్యే పరిస్థితి వచ్చే అవకాశం లేదని ఆర్బీఐ గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. అత్యధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ షేర్ పరుగు పెట్టింది. ఇది రెండు నెలల గరిష్టానికి చేరుకుంది. గత తొమ్మిది సెషన్‌లలో ఏడుసార్లు లాభపడిన ఈ స్టాక్ 13 శాతం రిటర్న్స్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications