అమెరికా నిరుద్యోగరేటు: భారీ లాభాల్లో నుండి దిగజారిన మార్కెట్లు, ఎందుకంటే?
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (జూన్ 8) స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ ఓ దశలో 600 పాయింట్లకు పైగా ఎగిసింది. నిఫ్టీ 175 పాయింట్లు పెరిగింది. కానీ సాయంత్రానికి ప్రారంభ లాభాలు ఆవిరై, స్వల్ప లాభాల్లో ముగిశాయి. సాయంత్రం సెన్సెక్స్ 83.34 పాయింట్లు లేదా 0.24% పెరిగి 34,370.58 వద్ద, నిఫ్టీ 25.30 పాయింట్లు లేదా 0.25% ఎగిసి 10,167.50 వద్ద క్లోజ్ అయింది. 1779 షేర్లు లాభాల్లో, 844 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 154 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. డాలర్‌తో రూపాయి మారకం విలువ 75.54 వద్ద క్లోజ్ అయింది.

అమెరికా నిరుద్యోగ రేటు ప్రభావం
గెయిల్, ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్స్ జాబితాలో ఉండగా, జీఎంటర్టైన్మెంట్, శ్రీ సిమెంట్స్, ఐచర్ మోటార్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే ఐటీ, బ్యాంకు, ఎనర్జీ స్పేస్ లాభాల్లో, ఫార్మా, ఆటో, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు నష్టాల్లో ముగిశాయి. అమెరికాలో నిరుద్యోగ రేటు తగ్గిందనే అంచనాలు విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచాయి. అమెరికాలో ఫ్యూచర్ మార్కెట్లు కూడా సానుకూలంగా ఉన్నాయి.

అనిశ్చితి భయాలు
మన దేశంలో లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా ఎత్తివేయడంతో గత కొద్ది రోజులుగా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. దీనికి తోడు అమెరికా నిరుద్యోగ రేటు తగ్గడం, అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లోకి రావడం, అనేక దేశాలు లాక్ డౌన్ నుండి బయటకు వచ్చి ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ దిశగా వేగంగా సాగుతుండటం వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంటుకు కలిసి వచ్చాయి. దీంతో ఉదయం భారీ లాభాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్లకు అనిశ్చితి భయాలు పట్టుకున్నాయి. దీంతో సాయంత్రానికి స్వల్ప లాభాలతో ముగిశాయి.

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ రికార్డ్ హైకి
సెన్సెక్స్ ఈరోజు 557 పాయింట్ల (డే హై) మేర పడిపోయి 83 పాయింట్ల లాభంతో ముగిసింది. సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 16 లాభాల్లో, 14 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ రూ.1,624 రికార్డ్ ధరకు చేరుకుంది. రిలయన్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ జియోలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో రిలయన్స్ షేర్ దూసుకెళ్తోంది. ఆ తర్వాత 1,570 వద్ద ముగిసింది.


Click it and Unblock the Notifications