భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, 57,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు బుధవారం (ఏప్రిల్ 27) భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. వరుసగా రెండు సెషన్లలో భారీ నష్టాల అనంతరం నిన్న భారీగా లాభపడిన సూచీలు, నేడు తిరిగి నష్టాల్లోకి వెళ్లాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. కార్పోరేట్ సంస్థల మిశ్రమ ఫలితాలు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, ఐరోపా దేశాలకు రష్యా గ్యాస్ సరఫరాను నిలిపివేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వంటి పరిణామాలు సూచీలకు ప్రతికూలంగా మారాయి.
మంగళవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్, టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ వంటి దిగ్గజ త్రైమాసిక ఫలితాలు అమెరికా మార్కెట్లపై ప్రభావం చూపాయి. చైనాలో కరోనా పెరుగుదల కారణంగా ఆసియా-పసిఫిక్ సూచీలు మిశ్రమంగా కదలాడుతున్నాయి. ఈ పరిణామాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.

సెన్సెక్స్ క్రితం సెషన్లో 57,356 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 57,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఉదయం గం.10.50 సమయానికి సెన్సెక్స్ 56,983 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,079 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,852 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 145 పాయింట్లు క్షీణించి 17,055 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. 17,073 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,110 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,031 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.


Click it and Unblock the Notifications