భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు: సెన్సెక్స్ 477 పాయింట్లు జంప్
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న దాదాపు 300 పాయింట్లు ఎగిసి సెన్సెక్స్ నేడు దాదాపు మరో 500 పాయింట్ల వరకు ఎగిసింది. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ, అది కూడా దాదాపు 200 పాయింట్ల లాభాల్లోనే కనిపించింది. ప్రధానంగా కన్స్యూమర్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ రంగాల షేర్లు ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 30 షేర్లలో ఒకటి రెండు తప్ప మిగిలినవి అన్నీ లాభాల్లోనే ట్రేడ్ ముగిశాయి. బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి.

రెండ్రోజుల్లో 750 పాయింట్లు
సెన్సెక్స్ నేడు ఉదయం 57,751.21 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,952.48 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,650.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 477 పాయింట్లు ఎగిసి 57,897 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17,177.60 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,250.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,161.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 147.00 (0.86%) పాయింట్లు ఎగిసి 17,233 పాయింట్ల వద్ద ముగిసింది. నిన్న 750 పాయింట్ల వరకు లాభపడింది. సూచీలు వారం గరిష్టానికి చేరాయి.

టాప్ లూజర్స్, గెయినర్స్
సుప్రియా లైఫ్ సైన్సెస్ షేరు నేడు లిస్టయింది. ఆఫర్ ధర రూ.274 కాగా, 53.7 శాతం ప్రీమియంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రా టెక్ సిమెంట్, టైటాన్ కంపెనీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి.

రూపాయి జంప్
డాలర్ మారకంతో రూపాయి నేడు మరింత లాభపడింది. నేటి సెషన్‌లో 34 పైసలు ఎగిసి 74.66 వద్ద క్లోజ్ అయింది. ఇండియన్ ఈక్విటీ సూచీల పాజిటివ్ కదలిక, బలమైన ఆసియా కరెన్సీ మద్దతు లభించింది.