దేశవ్యాప్తంగా లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) ఏర్పాటు నిబంధనలకు అధికారిక ఆమోదం లభించింది. ఈ నిర్ణయం ఉద్యోగుల వేతన నిర్మాణం, సేవా పరిస్థితులు, పెన్షన్ వ్యవస్థను సమీక్షించడానికి కీలకమైన అడుగుగా పరిగణించబడుతోంది.
ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, 8వ వేతన సంఘం ఒక తాత్కాలిక సంస్థగా ఏర్పాటవుతోంది. ఇది ఒక చైర్‌పర్సన్, ఒక పార్ట్‌టైమ్ సభ్యుడు, ఒక సభ్య-కార్యదర్శితో కూడి ఉంటుంది. కమిషన్ ఏర్పాటు చేసిన తేదీ నుండి 18 నెలలలోపు తన తుది సిఫార్సులను సమర్పించాలి. అవసరమైతే, నిర్దిష్ట అంశాలపై మధ్యంతర నివేదికలను కూడా సమర్పించవచ్చని ప్రభుత్వం తెలిపింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం. జనవరిలోనే 8వ వేతన సంఘం ఏర్పాటుకు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. ఇప్పుడు, రికార్డు స్థాయిలో తక్కువ సమయంలోనే పూర్తి కమిషన్ ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు.

కమిషన్ తన సిఫార్సులను రూపొందించేటప్పుడు దేశంలోని ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు,రాజకీయ-ఆర్థిక కోణం,ప్రభుత్వ ఖజానాపై ప్రభావం వంటి అంశాలను విశ్లేషిస్తుంది. వేతన సవరణలు ప్రభుత్వ వ్యయాల్లో పెద్ద మార్పులను కలిగించే అవకాశం ఉండటంతో, ఈ అంశంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపనుంది.
ఇప్పటివరకు అధికారిక వేతన స్లాబ్‌లు ప్రకటించకపోయినా, ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నట్లుగా, సగటు నెలవారీ వేతనాలు రూ.19,000 వరకు పెరగవచ్చు. ప్రస్తుతం నెలకు రూ.1 లక్ష వేతనం పొందుతున్న మధ్య స్థాయి కేంద్ర ఉద్యోగి, కొత్త వేతన సంఘం సిఫార్సులు అమలయ్యాక రూ.1.14 లక్షల నుండి రూ.1.16 లక్షల వరకు పొందే అవకాశం ఉంది.
రూ. 1.75 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయింపుతో.. జీతం రూ.1.14 లక్షలకు పెరగవచ్చు. అలాగే రూ.2 లక్షల కోట్లు కేటాయింపుతో జీతం రూ.1.16 లక్షలకు పెరగవచ్చు. ఇది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది కొత్త వేతన నిర్మాణంలో జీతాలు, పెన్షన్‌లు ఎన్ని రెట్లు పెరగాలో నిర్ణయించే ప్రధాన ప్రమాణం.
7వ వేతన సంఘంలో ప్రభుత్వం 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ను అమలు చేసింది. దీని ఫలితంగా సగటు వేతనాలు 157 శాతం పెరిగాయి. కనీస ప్రాథమిక వేతనం రూ.7 వేల నుండి రూ.18 వేలకు పెరిగింది.
ఇలాంటి ఫార్ములా మళ్లీ అమలైతే, 8వ వేతన సంఘం కింద కనీస వేతనం రూ.18 వేల నుండి రూ.46,260కు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
8వ వేతన సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు, సైనిక సిబ్బంది లాభపడే పెద్ద ఆర్థిక మార్పుగా భావిస్తున్నారు. ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం దేశీయ వినియోగం పెరగడం, ఆర్థిక వృద్ధి వేగవంతం కావడం, ఉద్యోగుల ఆర్థిక స్థిరత్వం మెరుగుపడటానికి దోహదపడవచ్చు.


Click it and Unblock the Notifications