రోజంతా పనులతో విసిగిపోయే సామాన్యులకు టీవీ కొంతమేర ఉపశమనం కలిగిస్తోంది. గతంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఛానల్స్ ని ఆనందించగలిగేవాళ్లం. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇక కొందరైతే కేబుల్, D2H కనెక్షన్స్ తీసుకోవడం మానేసి ఇంటర్నెట్ లో లైవ్ టీవీ చూస్తూ గడపాల్సి వస్తోంది.
టెలివిజన్ ప్రసారాలపై ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. నేరుగా మొబైల్ ఫోన్ల ద్వారా లైవ్ టీవీ ఛానల్స్ ను అందించేందుకు విధివిధానాలకు పరిశీలిస్తోంది. అంటే DTH తరహాలో ఇకపై D2M అన్నమాట. ఇందుకు ఇంటర్నెట్ సైతం అవసరం లేకపోవడం విశేషం.

D2Hగా పిలిచే ఈ కొత్త సాంకేతికత లక్ష్యం ఏమిటంటే.. మొబైల్స్ లో లైవ్ టీవీ వీక్షణకు అవకాశం కల్పించడం. టెలికమ్యూనికేషన్స్ శాఖ(DoT), సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ(MIB)లు IIT కాన్పూర్ తో కలిసి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి పనిచేస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.
అయితే టెలికాం ఆపరేటర్ల రాబడిలో అధిక శాతం ఇంటర్నెట్ వినియోగం నుంచే వస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త సాంకేతికత వల్ల వారి ఆదాయాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. అందువల్ల టెల్కోల నుంచి ఈ ప్రాజెక్టుపై తీవ్ర ప్రతిఘటన ఎదురుకావచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆయా ప్రొవైడర్ల 5G ప్లాన్స్ చెల్లాచెదురయ్యే అవకాశమూ లేకపోలేదు.
నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు. టెలికాం ఆపరేటర్లతో సహా సంబంధిత విభాగాలతో మాట్లాడిన అనంతరమే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలో జరగనున్న సమావేశంలో DoT, MIB, IIT కాన్పూర్ సహా టెలికాం, ప్రసార రంగాలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొంటారని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications