New Rules: ఏప్రిల్ 1 నుంచి ATM రూల్స్ మారుతున్నాయి.. ఇకపై ఛార్జీలు బాదుడే!
వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం నుండి కొన్ని బ్యాంకులు ఏటీఎం ఛార్జీలను పెంచబోతున్నాయి. ఏటీఎం ట్రాన్సాక్షన్లు, డెబిట్ కార్డ్ వినియోగానికి సంబంధించి హెచ్‌డిఎఫ్‌సి (HDFC Bank), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బంధన్ బ్యాంకులు కొత్త నిబంధనలు (New rules) ప్రకటించాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హెచ్‌డిఎఫ్‌సి, బంధన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఏటీఎం రూల్స్ ను అమల్లోకి తీసుకురానున్నాయి. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే ఉద్దేశంతో బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఏయే బ్యాంకులు ఎయే మార్పులు చేశాయంటే..

HDFC బ్యాంక్: UPI విత్ డ్రాల్స్‌పై పరిమితులు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన ఖాతాదారులకు షాకిస్తూ, కార్డ్‌లెస్ (Cardless) లేదా యూపీఐ ఆధారిత నగదు ఉపసంహరణలను కూడా ఉచిత లావాదేవీల కోటాలోకి చేర్చింది.
- పరిమితి: సొంత బ్యాంక్ ఏటీఎంలలో 5 సార్లు, ఇతర బ్యాంక్ ఏటీఎంలలో మెట్రో నగరాల్లో 3 సార్లు, నాన్-మెట్రోల్లో 5 సార్లు మాత్రమే ఉచితంగా నగదు తీసుకోవచ్చు.
- ఛార్జీలు: ఉచిత పరిమితి దాటిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్‌కు రూ. 23 (ప్లస్ టాక్సులు) చెల్లించాలి.
- సమయ నిబంధన: రాత్రి 7:30 గంటల తర్వాత చేసే లావాదేవీలను తర్వాతి రోజు కోటాలో లెక్కిస్తారు. అలాగే నెల చివరి రోజు రాత్రి 7:30 తర్వాత చేసే విత్ డ్రాయల్స్ తర్వాతి నెల కోటాలోకి వెళ్తాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB): నగదు పరిమితి సగానికి తగ్గింపు
పీఎన్‌బీ తన డెబిట్ కార్డ్ వినియోగదారులకు రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని భారీగా తగ్గించింది. రూపే ప్లాటినం, వీసా గోల్డ్, మాస్టర్ కార్డ్ ప్లాటినం వంటి కార్డుల ద్వారా గతంలో రోజుకు రూ. 1 లక్ష వరకు తీసుకునే వెసులుబాటు ఉండగా, ఇకపై దానిని రూ. 50,000 కు తగ్గించారు. రూపే ఉమెన్ పవర్, పీఎన్‌బీ పలాష్ వంటి కార్డ్ వేరియంట్లకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.
బంధన్ బ్యాంక్: ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్లపై జరిమానా
బంధన్ బ్యాంక్ మరింత కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది. మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేక ఏటీఎం లావాదేవీ విఫలమైతే (Failed transaction due to insufficient funds), బ్యాంకు రూ. 25 జరిమానా విధిస్తుంది.
- ఛార్జీలు: ఉచిత పరిమితి దాటిన తర్వాత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ. 23, నాన్-ఫైనాన్షియల్ (బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటివి) వాటికి రూ. 10 వసూలు చేస్తారు.
డిజిటల్ లావాదేవీలే శరణ్యం
బ్యాంకులు తీసుకువస్తున్న ఈ కొత్త నిబంధనలు (New rules) ప్రధానంగా నగదు నిర్వహణ భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్దేశించినవి. ATM ల వద్ద రద్దీని తగ్గించి, వినియోగదారులు యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ మార్గాల వైపు మళ్లేలా ఈ ఛార్జీలు , పరిమితులు విధిస్తున్నారు. కాబట్టి ఖాతాదారులు ఏప్రిల్ 1 నుండి తమ ఏటీఎం విత్ డ్రాయల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండటం, వీలైనంత వరకు ఆన్లైన్ చెల్లింపులు చేయడం ఆర్థికంగా లాభదాయకం.


Click it and Unblock the Notifications