Rent rules: యజమాని ఎప్పుడు పడితే అప్పుడు మీ ఇంట్లోకి రావచ్చా? 2026 కొత్త ప్రైవసీ రూల్స్ ఇవే!
భారతదేశంలో అద్దె ఇళ్ల మార్కెట్ ను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కొత్త రెంట్ రూల్స్ (Rent Rules 2026) ను అమల్లోకి తెచ్చింది. మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021 ఆధారంగా రూపొందించిన ఈ కొత్త నిబంధనలు అద్దెదారులు (Tenants) , యజమానుల (Landlords) మధ్య వివాదాలను తగ్గించడమే కాకుండా అద్దె ప్రక్రియను డిజిటలైజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
2026లో అతిపెద్ద మార్పు: డిజిటల్ రిజిస్ట్రేషన్
ఈ కొత్త నిబంధనల్లో అత్యంత కీలకమైన మార్పు 'డిజిటల్ టెనెన్సీ రిజిస్ట్రేషన్'. ఇకపై ప్రతి అద్దె ఒప్పందం (Rent Agreement) సంతకం చేసిన 60 రోజుల్లోపు ఆన్‌లైన్ లో రిజిస్టర్ కావాల్సిందే. చాలా రాష్ట్రాలు ఇప్పటికే తమ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ పోర్టల్స్ ను అద్దె రిజిస్ట్రేషన్‌తో అనుసంధానించాయి. దీనివల్ల నకిలీ ఒప్పందాలకు చెక్ పడటమే కాకుండా అక్రమంగా ఇళ్లను ఖాళీ చేయించడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఒకవేళ అగ్రిమెంట్ రిజిస్టర్ చేయకపోతే రూ. 5,000 నుండి భారీ జరిమానాలు పడే అవకాశం ఉంది.

సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ఉండాలి?
చాలా నగరాల్లో యజమానులు 6 నుండి 10 నెలల అద్దెను డిపాజిట్ గా అడుగుతుంటారు. కానీ 2026 రెంట్ రూల్స్ (Rent Rules) ప్రకారం, నివాస గృహాలకు (Residential) గరిష్టంగా రెండు నెలల అద్దెను మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకోవాలి. వాణిజ్య అవసరాలకు (Commercial) అయితే ఆరు నెలల అద్దె వరకు తీసుకోవచ్చు. దీనివల్ల సామాన్యులపై ఆర్థిక భారం తగ్గుతుంది.
అద్దె పెంపు, నోటీసు పీరియడ్
యజమానులు తమ ఇష్టానుసారంగా అద్దెను పెంచడానికి వీలు లేదు. అద్దె ఒప్పందంలో పేర్కొన్న విధంగా 12 నెలల తర్వాతే అద్దె పెంచాలి. అది కూడా అమలు చేయడానికి కనీసం 90 రోజుల ముందుగా అద్దెదారుకు లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి. ముందస్తు సమాచారం లేకుండా అద్దె పెంచితే అద్దెదారులు రెంట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించవచ్చు.
ప్రైవసీ , హక్కులు
కొత్త నిబంధనల ప్రకారం.. యజమాని అద్దెకు ఇచ్చిన ఇంట్లోకి తనిఖీ కోసం రావాలంటే కనీసం 24 గంటల ముందు నోటీసు ఇవ్వాలి. అలాగే పగటిపూట మాత్రమే రావాలి. అద్దెదారులను వేధించడం, నీరు లేదా విద్యుత్ కనెక్షన్లను కట్ చేయడం వంటి చర్యలు తీసుకుంటే యజమానులపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. అలాగే ఏదైనా ముఖ్యమైన రిపేర్లు (Plumbing, Electrical) ఉంటే, యజమాని 30 రోజుల్లోపు పూర్తి చేయాలి. లేదంటే అద్దెదారే ఆ పని చేయించుకుని, ఆ ఖర్చును అద్దెలో తగ్గించుకోవచ్చు.
వివాదాల పరిష్కారం ఎలా?
అద్దె వివాదాల కోసం ప్రత్యేకంగా రెంట్ అథారిటీలు, రెంట్ కోర్టులు, రెంట్ ట్రిబ్యునల్స్ పనిచేస్తాయి. ఇవి సాధారణ సివిల్ కోర్టుల కంటే వేగంగా పనిచేస్తాయి. ఏదైనా వివాదం తలెత్తితే 60 రోజుల్లోపు పరిష్కారం లభించేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దారు. ఇది యజమానులకు కూడా లాభదాయకం. ఎందుకంటే అద్దె చెల్లించని వారిని లేదా ఇల్లు ఖాళీ చేయని వారిని చట్టబద్ధంగా త్వరగా ఖాళీ చేయించవచ్చు.
మొత్తానికి కొత్త రెంట్ రూల్స్ వల్ల అటు యజమానులకు, ఇటు అద్దెదారులకు మేలు జరుగుతుంది. అద్దె ఒప్పందం చేసుకునే ముందే ఇరుపక్షాలు ఈ రూల్స్ గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే అనవసరమైన కోర్టు గొడవలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన ఇబ్బందులు తప్పుతాయి. మీరు కొత్తగా ఇల్లు అద్దెకు తీసుకుంటున్నా లేదా ఇస్తున్నా.. ఖచ్చితంగా 60 రోజుల్లోపు డిజిటల్ అగ్రిమెంట్ చేయించుకోవడం మర్చిపోకండి.


Click it and Unblock the Notifications